బాటా ఇండియా పరుగో పరుగు

బాటా ఇండియా పరుగో పరుగు

కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఫుట్‌వేర్‌ దిగ్గజం బాటా ఇండియా కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3 శాతం ఎగసింది. రూ. 1453కు చేరింది. ఇది చరిత్మాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1440 వద్ద ట్రేడవుతోంది. ఇందుకు గతేడాది(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు చూపగలదన్న అంచనాలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

6 నెలల్లో 68 శాతం
గత ఆరు నెలల కాలంలో బాటా ఇండియా షేరు ఏకంగా 68 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 15 శాతమే బలపడింది. ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కంపెనీలో వాటాలు కొనుగోలు చేయడం, కంపెనీ సాధించిన ఆర్థిక ఫలితాలు వంటి అంశాలు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) వరుసగా నాలుగో క్వార్టర్లోనూ బాటా ఇండియాలో వాటా పెంచుకున్నారు. డిసెంబర్‌కల్లా 10.35 శాతంగా నమోదైన ఎఫ్‌ఐఐల వాటా మార్చికల్లా 11.14 శాతానికి పెరిగింది. గతేడాదిలో ఎఫ్‌ఐఐల వాటా 5 శాతంమేర పెరగడం గమనార్హం! 

ఫలితాల జోరు
గతేడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బాటా ఇండియా నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 103 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 779 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 16.5 శాతం నుంచి 21 శాతానికి ఎగశాయి. క్యూ4(జనవరి-మార్చి)లోనూ కంపెనీ ఇదే స్థాయిలో పనితీరు చూపవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular