ఎఫ్‌ఐఐల ఎఫెక్ట్‌- హెచ్‌ఈజీ పతనం

ఎఫ్‌ఐఐల ఎఫెక్ట్‌- హెచ్‌ఈజీ పతనం

ఇటీవల నేలచూపులకే పరిమితమవుతున్న గ్రాఫైట్ ఎలక్ట్రోడ్‌ తయారీ సంస్థ హెచ్‌ఈజీ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. కంపెనీలో సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను విక్రయించినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత హెచ్‌ఈజీ షేరు రూ. 1835 వరకూ పతనమైంది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ప్రస్తుతం దాదాపు 4 శాతం నష్టంతో రూ. 1858 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 9 శాతం క్షీణించింది. 

హెచ్‌ఈజీ లిమిటెడ్‌
గతేడాది చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా హెచ్‌ఈజీ లిమిటెడ్‌లో 3 శాతం తగ్గి 15.29 శాతానికి పరిమితమైంది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల వాటా 18.57 శాతంగా నమోదైంది. కాగా.. ఎక్స్ఛేంజీలకు హెచ్‌ఈజీ అందించిన సమాచారం ప్రకారం ఇదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) వాటా 2.25 శాతం తగ్గింది. 5.75 శాతానికి చేరింది. డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐల వాటా 8 శాతంగా నమోదైంది. ఈ బాటలో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా సైతం 1.21 శాతం నుంచి 0.15 శాతానికి క్షీణించింది. అయితే కంపెనీ ఇటీవల చేపట్టిన ఈక్విటీ బైబ్యాక్‌లో భాగంగా ఇన్‌స్టట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కొంతమేర వాటాలను ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా డిసెంబర్‌లో నమోదైన 13.07 శాతం నుంచి మార్చికల్లా 16.1 శాతానికి పెరగడం గమనార్హం!

క్షీణపథంలో..
ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ఇప్పటివరకూ హెచ్‌ఈజీ షేరు 51 శాతం పతనమైంది. డిసెంబర్‌ 31న రూ. 3720 వద్ద ముగిసింది. గతేడాది అక్టోబర్‌లో రూ. 4950 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ఇటీవల చైనాలో ఆర్థిక మందగమనం, స్టీల్‌ ధరలు పతనంకావడం వంటి అంశాల కారణంగా గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ ధరలు నీరసిస్తూ వచ్చాయి. ఈ ప్రభావం షేరుపై పడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.Most Popular