కేంద్రంలో ఏ పార్టీ గెలిస్తే... ఏ కంపెనీల స్టాక్స్ పెరగొచ్చు..? 

కేంద్రంలో ఏ పార్టీ గెలిస్తే... ఏ కంపెనీల స్టాక్స్ పెరగొచ్చు..? 

ప్రస్తుతం దేశీ స్టాక్స్ మార్కెట్లలో  ప్రీ ఎలక్షన్ ర్యాలీ కొనసాగుతోందని చెప్పొచ్చు. బెంచ్ మార్క్ సూచీలు దాదాపు 10శాతం పెరిగాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడనుందని, మోడీ అనుకూల పవనాలంటూ ప్రీపోల్ సర్వేలు మార్కెట్లను కాస్త స్థిర పరిచాయనే చెప్పొచ్చు. అయితే  రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దాని కంటే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. దలాల్ స్ట్రీట్‌లో ఏ ఏ స్టాక్స్ వృద్ధిలోకి వస్తాయన్న దానిపై ఎకనామిక్స్ టైమ్స్ ఓ సర్వేను నిర్వహించింది. పలు రంగాల్లోని వ్యక్తులతో మాట్లాడిన దాన్ని బట్టి  బీజేపీ అధికారంలోకి వస్తే.. కొన్ని స్టాక్స్ పెరగొచ్చని, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వేరే మరి కొన్ని స్టాక్స్ లో వృద్ధిలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో మనమూ చూద్దాం.

Image result for modi
బీజేపీ కమ్ బ్యాక్‌ అయితే...!
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెద్దగా ఆర్ధిక పరమైన స్కాములు జరగక పోయినా.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి సామాన్యుడిని కాస్త ఇబ్బంది పెట్టాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తన మ్యానిఫేస్టోలో దాదాపు రూ. 100 లక్ష కోట్ల రూపాయిలతో అభివృద్ధి పథకాలను చేపడతామని పేర్కొంది. ముఖ్యంగా రూరల్ డెవలప్‌ మెంట్ , ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగాల్లో అభివృద్ధిని చేసి చూపెడతామని బీజేపీ మ్యానిఫేస్టో పేర్కొంటుంది. అంతే కాకుండా రానున్న ఐదేళ్ళలో దేశంలోని మరో 50 సిటీలను మెట్రో కారిడార్‌లోకి చేరుస్తామని కూడా హామినిచ్చింది. బీజేపీ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే.. ఇన్ఫ్రా రంగంలో అతి పెద్ద మలుపును మనం చూడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇందులో నుంచి అధిక లాభాలు కనబడే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. లారెన్స్ అండ్ టుబ్రో,  సద్భావ్ ఇంజనీరింగ్, దిలీప్ బిల్డ్ కాన్ వంటి ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలు అత్యంత ఆకర్షణీయంగా మారొచ్చు. అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈ కంపెనీలతో బాటు ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి స్టాక్స్ మరింత వృద్ధిని కనబరచవచ్చని ఎనలిస్టుల అంచనా. బ్యాంకుల పనితీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే.. బ్యాంకుల మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు (NPAs) మీద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకింగ్ రంగం కూడా ఆకర్షణీయంగా మారొచ్చని ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ కూడా ఛాంపింయన్ స్టాక్స్ గా మారొచ్చని వారి అంచనా. 

Image result for rahul
అధికారం "హస్త"గతమైతే.... ? 
ఇక కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోలో రూరల్ డెవలప్‌మెంట్ , రైతులకు ప్రత్యేక బడ్జెట్ , రుణ మాఫీలు వంటి వాటికి పెద్ద పీట వేశారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి , పేదలకు న్యాయ్ పథకం కింద నగదు బదిలీ పథకాలు అమలు అయితే.. మహీంద్ర & మహీంద్ర,  క్రాంప్టన్ గ్రీవ్స్ , కన్జూమర్స్ గూడ్స్ వంటి స్టాక్స్ పుంజుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... న్యాయ్ పథకం కింద సంవత్సరానికి రూ. 72,000 పేదలకు కేటాయింపు, నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ  చట్టం ( NREGA ) వంటి వాటి వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ రంగంలో ఊపు కనిపించవచ్చు. FMCG కంపెనీల స్టాక్స్  అప్పుడు ఆకర్షణీయంగా మారుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. టైటాన్,  బాటా, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ , మారికో, వరుణ్ బేవరేజెస్  వంటివి లబ్ది పొందుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
అలాగే  బీజేపీ అధికారంలోకి వచ్చినా, లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇన్సూరెన్స్ , హెల్త్ కేర్ రంగాలు ఖచ్చితంగా రాణించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు రంగాలకు రెండు పార్టీలు పెద్ద పీటే వేశాయి.  బీజేపీ ఆయుష్మాన్ భవ ఇప్పటికే ప్రజల ఆదరణకు నోచుకుంది. కాంగ్రెస్ కూడా ఆరోగ్యం, భీమా రంగాల్లో తన ప్రాధాన్యతలను మ్యానిఫేస్టోలో చేర్చింది . ఆరోగ్యాన్ని ప్రాధమిక హక్కుగా ప్రతి ఒక్క పౌరుడికి అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా ఎస్బీఐ లైఫ్, ICICI ప్రుడెన్షియల్ స్టాక్స్ రానున్న 5 ఏళ్ళలో రివార్డింగ్ స్టాక్స్ గా మారొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
 

DISCLAIMER: పైన పేర్కొన్న సలహాలు, సూచనలు నిపుణులు, ఎనలిస్టులచే సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోమని మనవి.Most Popular