లాభాల్లో- ప్రభుత్వ బ్యాంక్స్‌ దన్ను

లాభాల్లో- ప్రభుత్వ బ్యాంక్స్‌ దన్ను

ముందురోజు నమోదైన భారీ నష్టాల నుంచి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కోలుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 38,745కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 11,626 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరల మంటతో ముందురోజు పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా బౌన్స్‌బ్యాక్‌ అయినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే డెరివేటివ్స్‌ ముగింపు, ఎన్నికల మూడో దశ పోలింగ్‌ నేపథ్యంలో తొలుత ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వెనువెంటనే జోరందుకున్నాయి. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఐటీ 0.2 శాతం నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.35 శాతం పుంజుకోగా.. మీడియా, రియల్టీ, ఫార్మా 1.6-0.7 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరోమోటో 5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే గెయిల్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో పీఎన్‌బీ, కెనరా, యూనియన్‌, జేఅండ్‌కే, బీవోబీ, అలహాబాద్‌, ఓబీసీ, సిండికేట్‌, ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, బీవోఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్ కేపిటల్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్ ఇన్ఫ్రా, లుపిన్‌, ఎన్‌సీసీ, బాటా 8.5-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఇన్ఫీబీమ్‌, కర్ణాటక బ్యాంక్‌, చెన్నై పెట్రో, జైన్‌ ఇరిగేషన్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, ఇండియా సిమెంట్స్‌, పిడిలైట్‌, మదర్సన్‌ సుమీ 4.4-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1131 లాభపడగా.. 1038 నష్టాలతో కదులుతున్నాయి. Most Popular