ఇన్‌ట్యూటివ్‌ పతనం- కింబర్లీ జోష్‌

ఇన్‌ట్యూటివ్‌ పతనం- కింబర్లీ జోష్‌

ఈస్టర్‌ సందర్భంగా యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకావడంతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ మందకొడిగా సాగింది. ఈ వారం చివర్లో బోయింగ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ తదితర దిగ్గజాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. సోమవారం డోజోన్స్‌ 48 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 26,511కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 3 పాయింట్ల(0.16 శాతం) స్వల్ప లాభంతో 2,908 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 17 పాయింట్లు(0.2 శాతం) పుంజుకుని 7,998 వద్ద స్థిరపడింది. 

ఇంధన రంగం దన్ను
ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షల కారణంగా ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఊపందుకున్నాయి. దీంతో ఇంధన రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఎస్‌అండ్‌పీ ఎనర్జీ ఇండెక్స్‌ 2 శాతం ఎగసింది. కాగా.. త్రైమాసిక ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఇన్‌ట్యూటివ్‌ సర్జికల్‌ ఇంక్‌ షేరు 7 శాతం పతనమైంది. అయితే పటిష్ట ఫలితాల నేపథ్యంలో కన్జూమర్‌ ప్రొడక్టుల సంస్థ కింబర్లీ క్లార్క్‌ కార్ప్‌ 5.4 శాతం జంప్‌చేసింది. 

ఆసియా అటూఇటూ
ఈస్టర్‌ సందర్భంగా సోమవారం యూరోపియన్‌ మార్కెట్లకు సెలవుకాగా... ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, తైవాన్‌, చైనా 0.25-0.1 శాతం మధ్య నీరసించగా.. ఇండొనేసియా 0.5 శాతం ఎగసింది. మిగిలిన మార్కెట్లలో కొరియా నామమాత్ర లాభంతో కదులుతోంది. థాయ్‌లాండ్‌ మార్కెట్‌కు సెలవు. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 97.32కు చేరగా.. డాలరుతో మారకంలో యూరో 1.125ను తాకింది. జపనీస్‌ యెన్‌ 111.96 వద్ద కదలుతోంది.Most Popular