ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 11,626 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇరాన్‌పై ఆంక్షలు, కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈస్టర్‌ సందర్భంగా యూరోపియన్‌ మార్కెట్లకు సెలవుకాగా.. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ఏప్రిల్‌ సిరీస్‌ ఎఫ్‌అండ్‌వో ముగింపు, సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌ వంటి అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

మార్కెట్ల పతనం  
డెరివేటివ్స్‌ ముగింపు, ఎన్నికల మూడో దశ పోలింగ్‌ వంటి అంశాల నేపథ్యంలో సోమవారం నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పతనబాట పట్టాయి. ముడిచమురు ధరలు వేడెక్కడంతో మార్కెట్ల ప్రారంభానికి ముందే రూపాయి పతనమైంది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 495 పాయింట్లు కోల్పోయి 38,645 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 158 పాయింట్లు పతనమై 11,595 వద్ద స్థిరపడింది. వెరసి 2019లో తొలిసారి మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. 2018 అక్టొబర్‌ తరువాత బ్యాంక్‌ నిఫ్టీ భారీ పతనాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం! 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,543 పాయింట్ల వద్ద, తదుపరి 11,492 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,686 పాయింట్ల వద్ద, తదుపరి 11,778 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29460, 29,233 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,103, 30,517 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సైలెన్స్ ప్లీజ్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 73 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 68 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించడం గమనార్హం! కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1038 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు దాదాపు రూ. 338 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.Most Popular