ఇక ఎఫ్‌అండ్‌వో- ఫలితాల ఎఫెక్ట్‌

ఇక ఎఫ్‌అండ్‌వో- ఫలితాల ఎఫెక్ట్‌

గడిచిన వారం ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితమైంది. అయినప్పటికీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోవడం విశేషం! గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగ సందర్భంగా శుక్ర, సోమవారాల్లో యూరోపియన్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కాగా.. ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ కాంట్రాక్టుల గడువు గురువారం(25న) ముగియనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే సిరీస్‌కు రోలోవర్ చేసుకునే వీలుంది. దీంతో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

క్యూ4 జాబితా
ఐటీ దిగ్గజాలతోపాటు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సైతం గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ4 పనితీరును వెల్లడించడంతో ఇప్పటికే ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ శనివారం(20న), ఏసీసీ 23న అల్ట్రాటెక్‌ 24న, మారుతీ సుజుకీ 25న చివరి త్రైమాసిక పనితీరు వెల్లడించనున్నాయి. ఇదే విధంగా యాక్సిస్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, యస్‌ బ్యాంక్‌ 26న ఫలితాలు ప్రకటించనున్నాయి. శుక్రవారం ఫలితాలు వెల్లడించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, శనివారం పనితీరు ప్రకటించనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. కౌంటర్లు సోమవారం ట్రేడింగ్‌లో సెంటిమెంటుపై ప్రభావాన్ని చూపగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికలకూ ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ నెల 18న రెండో దశ  పోలింగ్‌ ముగియగా.. మూడో దశ 23న, నాలుగో దశ పోలింగ్‌ 29న పూర్తికానుంది. మొత్తం ఏడు దశలలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 19న చివరి దశ పోలింగ్‌ ముగియనుండగా.. ఫలితాలు అదే నెల 23న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పోలింగ్ సరళి, రాజకీయ పార్టీల గెలుపోటముల అంచనాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇతర అంశాలూ..
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అమెరికా, చైనా వాణిజ్య చర్చలు, కేంద్ర బ్యాంకుల విధానాలు.. తదితర పలు ఇతర అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయగలవని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 



Most Popular