పెట్రో పడేస్తే.. రిటైల్, జియో గట్టెక్కించాయ్ ! రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 రిజల్ట్స్

పెట్రో పడేస్తే.. రిటైల్, జియో గట్టెక్కించాయ్ ! రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 రిజల్ట్స్

ఎనలిస్టులు ఊహించినట్టుగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమ్, రిఫైనింగ్ లాభాలు తగ్గినప్పటికీ రిటైల్, జియోల రూపంలో ముకేష్ అంబానీ మరోసారి తన గ్రూప్ సత్తాను చాటారు. ఒక క్వార్టర్లో రూ.10 వేల కోట్ల నికర లాభాన్ని మరో సారి ఆర్జించి భేష్ అనిపించుకున్నారు. మెరుగైన క్యూ4 ఫలితాలను వెల్లడించిన సంస్థ అదే జోరును కొనసాగించింది. రాబోయే రోజుల్లో రిటైల్, జియోలపైనే అధిక ఫోకస్ ఉండబోతోందని ఈ ఫలితాలే స్పష్టంగా చెబ్తున్నాయి. భవిష్యత్ రిలయన్స్‌ను నిర్మించడంలో తాము సఫలం అయ్యామంటూ ముకేష్ అంబానీ ప్రకటన దీన్ని సూచిస్తోంది. 

దేశంలో మోస్ట్ వేల్యూడ్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ సంస్థ ఆదాయం ఈ క్వార్టర్లో రూ.1,54,110 కోట్లకు చేరింది. ఇది నిరుటితో పోలిస్తే 19.40 శాతం అధికం. కన్సాలిడేట్‌ పద్ధతిలో మొత్తం ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే.. గ్రూప్ ఆదాయం 44.6 శాతం వృద్ధి చెంది రూ.6,22,809 లక్షల కోట్లకు చేరింది. 

నీరసించిన రిఫైనింగ్ వ్యాపారం
గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) ఈ క్వార్టర్లో బ్యారెల్‌కు 8.2 డాలర్లుగా మాత్రమే ఉంది. ఇది క్యూ3లో 8.8 డాలర్లు, క్యూ2లో 11 డాలర్లుగా ఉండేది. ఈ విభాగం ఆదాయం కూడా క్యూ3తో పోల్చి చూస్తే 21.4 శాతం క్షీణించి రూ.87844 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్లు 4.8 శాతం మాత్రమే ఉన్నాయి. 

పెట్రోకెమికల్స్ అంతంతే
క్యూ4లో ఈ విభాగం రూ.42414 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్యూ3తో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. అయితే ఎబిట్ మార్జిన్లు 18 నుంచి 18.8 శాతానికి పెరిగాయి. 

ఆయిల్ అండ్ గ్యాస్ తుస్..
ఈ విభాగం ఆదాయం క్యూ3తో పోలిస్తే 9.6 శాతం తగ్గి రూ.1069 కోట్లుగా నమోదైంది. రూ. 267 కోట్లు నెగిటివ్ ఎబిట్. మార్జిన్లు 25 శాతం నెగిటివ్‌గా ఉన్నాయి. 

రిటైల్‌కు లాభాల దన్ను 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రముఖ సంస్థ రిటైల్ మొట్టమొదటిసారిగా ఆదాయంలో రూ.లక్ష కోట్ల మార్కను అధిగమించింది. ప్రధానంగా నాలుగో త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.రూ.36663 కోట్లు. ఎబిటా 81 శాతం పెరిగి రూ.1721 కోట్లకు చేరింది. ఎబిట్ మార్జిన్సు 4.7 శాతం మాత్రమే ఉన్నాయి. 

జియో భల్లే భల్లే.. 
క్యూ4లో డిజిటల్ ఆదాయం రూ.13609 కోట్లుగా నమోదైంది. ఇది క్యూ3తో పోలిస్తే 10.3 శాతం అధికం. ఎబిట్ మార్జిన్ 19.2 నుంచి 19.6 శాతానికి పెరిగాయి. సబ్‌స్క్రైబర్ బేస్ 30.6 కోట్లకు పెరిగింది. ఎబిటా రూ.2665 కోట్లకు చేరగా నికర లాభం రూ.840 కోట్లుగా నమోదైంది. ఒక్కో యూజర్ ద్వారా వచ్చే నెలకు లభించే ఆదాయం (ARPU) రూ.126.2కు చేరింది. 

రూ.3 లక్షల కోట్ల అప్పు
ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ పై ఉన్న మొత్తం అప్పు భారం రూ.2,87 లక్షల కోట్లు. ఇది అంతకు ముందు ఏడాది రూ.2.18 లక్షల కోట్లుగానే ఉండేది. 
సంస్థ చేతిలో నగదు రూ.1,33,027 కోట్లు ఉంది. ఇది అంతకు ముందు రూ.78 వేల కోట్లుగా ఉండేది. 

హైలైట్స్
మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన రిలయన్స్
నికర లాభంలో 9.8 శాతం వృద్ధి, రూ.10362 కోట్లు
ఆదాయంలో 19.4 శాతం వృద్ధి, రూ.1.54 లక్షల కోట్లు
రిటైల్ సేవల్లో 51.6 శాతం వృద్ధి 
డిజిటల్ సేవల వ్యాపారంలో 61.6 శాతం వృద్ధి
పెట్రోకెమికల్ ఆదాయంలో 7 శాతం క్షీణత
రిపైనింగ్‌ బిజినెస్‌లో తగ్గిన మార్జిన్లు
ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో నష్టాలు

- నాగేంద్ర సాయిMost Popular