బిజెపికి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు - రాకేష్ జున్‌జున్‌వాలా

బిజెపికి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు - రాకేష్ జున్‌జున్‌వాలా

ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజార్టీని రాకపోవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం కీలక భాగస్వామిగా మారొచ్చని విశ్లేషించారు. 

ఆయన ఫిబ్రవరి నెలలో మోడీ, బిజెపిపై పటిష్టమైన నమ్మకాన్ని ఉంచారు. మోడీ ఈ ఎన్నికల్లో విజయ దుంధుబి మోగిస్తారని గట్టిగా చెప్పారు. అయితే ఈ లోపే తన ఆలోచనను మార్చుకోవడం మార్కెట్ వర్గాలను కొద్దిగా ఆశ్చర్యంలోకి నెడ్తోంది. ఇప్పటికీ కేవలం ఒక్క దశలో మాత్రమే పోలింగ్ పూర్తైంది. 

బిగ్ బుల్ మాటల ప్రకారం ఈ బుల్ ర్యాలీలో గత నాలుగు దశాబ్దాలుగా పేదలు ఎవరూ లబ్ధి పొందలేదని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగాలని, అప్పుడే అగ్రెసివ్‌గా వెళ్లి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఆశలు అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు లాభాలు తక్కువే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన విశ్లేషించారు. 

వెల్త్ ట్యాక్స్‌ను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. దీన్ని ప్రవేశపెట్టాలని ఆలోచించడం కూడా సరికాదనన్నారు. ఒక వేళ దీన్ని మొదలుపెడితే తన దగ్గరున్న ఆస్తుల్లో 2.5 శాతం అమ్మేసి పన్నులు కట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. 

ఏవైనా పథకాలు ప్రవేశపెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, పాపులారిటీ కోసం ఇవి తీసుకురావడం సరికాదని ఆక్షేపించారు. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికలను గుర్తు చేసుకున్నారు జున్‌జున్‌వాలా. అక్కడ ఓ అభ్యర్థి తాను గెలిస్తే వెల్త్ ట్యాక్స్‌ను మళ్లీ ప్రవేశపెడ్తానని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక వేళ ఒక దేశంలో ఇలాంటిది మొదలుపెడితే.. ఈ ట్రెండ్ ఇతర దేశాలకూ పాకడంలో పెద్ద ఆశ్చర్యం లేదన్నారు. 
 Most Popular