పాలీకేబ్‌ ఇండియా.. లాభాల లిస్టింగ్ 

పాలీకేబ్‌ ఇండియా.. లాభాల లిస్టింగ్ 

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న వైర్లు, ఫాస్ట్‌మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ తయారీ సంస్థ పాలీకేబ్‌ ఇండియా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 538కాగా.. బీఎస్‌ఈలో రూ. 117 లాభంతో రూ. 633 వద్ద లిస్టయ్యింది. తదుపరి రూ. 657 వద్ద ఇంట్రాడే గరిష్టాన్నీ, రూ. 633 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం దాదాపు 22 శాతం జంప్‌చేసి రూ. 655 వద్ద ట్రేడవుతోంది. ఐపీవో ద్వారా పాలీకేబ్‌ ఇండియా రూ. 1346 కోట్లు సమకూర్చుకుంది. 

ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్
పాలీకేబ్‌ ఐపీఓకు 52 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో 10 శాతం పైగా ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించడం ఇదే తొలిసారి. గత ఏడాది జూలైలో వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి ఐపీఓకు 83 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ రాగా... ఆ తర్వాత గరిష్ట రెస్పాన్స్‌ పాలీక్యాబ్‌కే వచ్చింది. క్యూఐబీ కోటాలో 92.44 రెట్లు స్పందన లభించగా, సంపన్నవర్గాల కోటాలో 110.42 రెట్లు, రిటైల్‌ విభాగంలో 4.61 రెట్లు చొప్పున బిడ్స్‌ దాఖలయ్యాయి. ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో మొత్తం 6 ఇష్యూలు రాగా మెట్రోపొలిస్‌కు 5.83 రెట్ల  సబ్‌స్క్రిప్షన్‌ లభించిన విషయం విదితమే. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 

యాంకర్‌ నిధులు
ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి  రూ. 401 కోట్లు సమీకరించినట్లు పాలీకేబ్‌ ఇండియా తెలియజేసింది. షేరుకి రూ. 538 ధరలో 74.5 లక్షల షేర్లను యాంకర్‌ సంస్థలకు కేటాయించింది. ఇష్యూలో 25కుపైగా యాంకర్‌ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. Most Popular