ఈ  ఏడాది సాధారణ వర్షపాతం - ఐఎండీ

ఈ  ఏడాది సాధారణ వర్షపాతం - ఐఎండీ

రైతన్నలకు ఖుషీ ఖబర్‌. ఈ  ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఇంతకుముందు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని  స్క్రైమేట్‌ అంచనా వేయగా... ఐఎండీ మాత్రం రైతులను ఆనందంలో ముంచెత్తే అంచనాలను ప్రకటించింది. ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావం ఉండదని, వేసవికాలం తర్వాత ఎల్‌ నినో బలహీనపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా ఎల్‌ నినో ప్రభావం ఉంటే తక్కువ వర్షపాతం నమోదై కరవు సంభవిస్తుంది. 

భారత్‌లో కురిసే వర్షపాతంలో 70 శాతం వాటా నైరుతి రుతుపవనాలదే. దేశంలో సగానికి పైగా నీటిని పంటలు పండించేందుకు ఉపయోగిస్తుండటంతో వర్షాలు భారత ఆర్థిక వృద్ధిరేటుకు కీలకంగా మారాయి.  జూన్-సెప్టెంబర్ మధ్య లాంగ్‌టర్మ్‌ యావరేజ్‌తో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని  ఐఎండీ అంచనా వేసింది. ఈ నాలుగు నెలల్లో దేశంలో సగటున 89 సెం.మీ. వర్షం కురుస్తుంది. నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సాధారణ వర్షపాతం నమోదైతే.. అది భారత రైతాంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైన అంశమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వర్షాలు సమృద్ధిగా కురిస్తే దేశంలో ఉత్పత్తి పెరగడంతో ఆహార పదార్థాల ధరలు దిగివస్తాయి. ప్రపంచంలో వరితో పాటు గోధుమలు, పత్తి ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆహార ఉత్పత్తి పెరిగితే దేశ జనాభాకు సరిపోతుంది. ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే వంటనూనెలు తదితర కమోడిటీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏదేమైనా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ అంచనాలు వెలువడడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 
 Most Popular