వర్షపాతం ఓకే- మార్కెట్లు ఖుషీ

వర్షపాతం ఓకే- మార్కెట్లు ఖుషీ

తొలుత ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రోత్సాహం లభించగా.. చివర్లో వాతావరణ శాఖ(ఐఎండీ) నుంచి చల్లటి కబురు అందడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల మధ్యే కదిలాయి. ఎల్‌నినో బలహీనపడుతున్న సంకేతాల కారణంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకావచ్చంటూ ఐఎండీ తాజాగా అంచనా వేసింది. దీంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 139 పాయింట్లు పెరిగి 38,906 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 47 పాయింట్లు పుంజుకుని 11,690 వద్ద స్థిరపడింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు ఐఎండీ తొలి అంచనాలు ప్రకటించింది. 

రియల్టీ, ఆటో, ఐటీ అప్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, ఐటీ రంగాలు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, హీరోమోటో, సిప్లా, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌ 7.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్ఫోసిస్‌ 2.6 శాతం పతనంకాగా.. ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, గెయిల్‌, యస్‌ బ్యాంక్‌, ఐవోసీ, ఓఎన్‌జీసీ, టైటన్‌, జీ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ ఏర్పడింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1454 లాభపడగా 1130 నష్టాలతో ముగిశాయి. 

డీఐఐలు సైలెంట్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 897 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 16 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 476 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ నామమాత్రంగా రూ. 16.6 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.Most Popular