కేంద్రం చేతిలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ను భవిష్యత్తు...

కేంద్రం చేతిలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ను భవిష్యత్తు...

కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడానికి పైలెట్లు రంగంలోకి దిగారు. ఎస్‌బీఐ వెంటనే రూ.1500 కోట్లను విడుదల చేసి సంస్థను ఆదుకోవాలని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలెట్ల యూనియన్‌) ఇవాళ అప్పీల్‌ చేసింది.  వేతన బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడం, పైలెట్లు సెలవులో వెల్లడంతో గత కొన్ని వారాలుగా పలు జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 6-7 విమాన సర్వీసులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎస్‌బీఐ వెంటనే రూ.1500 కోట్ల నిధులను విడుదల చేయాలని, దీంతో సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని  నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ తెలిపింది. అలాగే కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిష్కారం కనుగొనాలని, 20వేలకు పైగా ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని వెల్లడించింది. 

ఇవాళ జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలెట్లు, ఇంజనీర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి పైలెట్లు, ఇంజనీర్లు, సీనియర్‌ ఉద్యోగులకు జీతాలు అందాయని, అయితే గత 3 నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో సంస్థ యాజమాన్యం విఫలమైందని  నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం నడుస్తున్న 6-7 సర్వీసులను కూడా మరో 24 గంటల్లో రద్దు చేయాల్సి వస్తుందని, సంస్థ యాజమాన్యం ఇప్పటికైనా జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేసింది. Most Popular