సెన్సెక్స్‌ అప్‌- మెటల్‌ భేష్‌- ఫార్మా వీక్‌

సెన్సెక్స్‌ అప్‌- మెటల్‌ భేష్‌- ఫార్మా వీక్‌

సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. సెన్సెక్స్ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 123 పాయింట్లు పెరిగి 38,890కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు పుంజుకని 11,680 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ సంకేతాలు హుషారునివ్వడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. బ్యాంకింగ్‌, ఇతర బ్లూచిప్స్‌ అండతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం సానుకూలంగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

రియల్టీ ప్లస్‌లో 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా 0.5 శాతం నీరసించింది. మెటల్‌ 2 శాతం, రియల్టీ, ఆటో 1.3 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, టీసీఎస్‌, హిందాల్కో, హీరోమోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా 6.2-1.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్ఫోసిస్‌ 3.5 శాతం పతనంకాగా, సన్‌ ఫార్మా, ఐవోసీ, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్, బీపీసీఎల్‌ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో శోభా, ఫీనిక్స్‌,  ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, సన్‌టెక్‌, మహీంద్రా లైఫ్‌, ప్రెస్టేజ్‌ 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో పీసీ జ్యవెలర్స్‌, సుజ్లాన్‌, బిర్లా సాఫ్ట్‌, జీఎస్‌ఎఫ్‌సీ, ఇన్ఫీబీమ్‌, జస్ట్‌డయల్‌ 9-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు డీసీబీ బ్యాంక్‌, టాటా పవర్‌, ఎన్‌సీసీ, అరవింద్‌, రామ్‌కో సిమెంట్‌, ఓబీసీ, బయోకాన్‌, ఆర్‌ఈసీ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.  

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1400 లాభపడగా 924 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.



Most Popular