ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,685 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. శుక్రవారం బ్యాంకింగ్‌, ఇతర బ్లూచిప్స్ అండతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. యూరోపియన్‌ మార్కెట్లు సైతం లాభాలతో నిలవగా... ఆసియాలోనూ ప్రస్తుతం సానుకూల ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకావడంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా నేడు మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

లాభాల ముగింపు
మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ వారాంతాన  సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి వరకూ పటిష్టంగా కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 160 పాయింట్లు పెరిగి 38,767 వద్ద నిలవగా.. నిఫ్టీ 47 పాయింట్లు ఎగసి 11,643 వద్ద ముగిసింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,596 పాయింట్ల వద్ద, తదుపరి 11,548 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,674 పాయింట్ల వద్ద, తదుపరి 11,705 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29763, 29588 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,057, 30,176 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐలు సైలెంట్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 897 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 16 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 476 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ నామమాత్రంగా రూ. 16.6 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.Most Popular