జెరోధాకు ఓ బ్రోకర్ చెమటలు పట్టిస్తున్నాడు..!

జెరోధాకు ఓ బ్రోకర్ చెమటలు పట్టిస్తున్నాడు..!

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకింగ్ వైపు చూస్తున్నాయి. కస్టమర్లకు భారీ రాయితీలు ప్రకటించి కొత్త వినియోగ దారులను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే మనీ ట్రాన్స్ఫరింగ్‌లో పేరొందిన పేటీఎం  కూడా పేటీఎం మనీ పేరిట స్టాక్ బ్రోకింగ్‌ రంగంలోకి దిగుతుంది. అయితే.. ఇప్పటికే దేశంలో బ్రోకరేజ్ సంస్థల్లో అగ్రగామిగా ఉన్న జెరోధా బ్రోకింగ్ సంస్థకు ఇది నష్టదాయకంగా మారుతుందా? మిగతా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల విషయంలో జెరోధా ఆందోళన చెందనప్పటికీ, పేటీఎం వంటి కంపెనీలు ఈ రంగంలో రావడం కాస్త ఆందోళన చెందాల్సిన విషయమేనని జెరోధా భావిస్తోంది. మిగతా కంపెనీలతో పోటీ లేనప్పటికీ పేటీఎం స్టాక్ బ్రోకరేజ్ రంగంలోకి రావడంతో మేము అప్రమత్తం కావాల్సిన సమయం మాత్రం వచ్చిందని అంటున్నారు జెరోధా సీఈఓ నితిన్ కామత్. 
స్టాక్ బ్రోకరేజ్ సేవలను అందించడానికి సెబీ నుండి అనుమతులను పొందింది పేటీఎం. తనకున్న విస్తారమైన నెట్ వర్క్, మిగతా మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీలతో పోలిస్తే అధికంగా ఉన్న కస్టమర్లే తనకు బలం అని పేటీఎం భావిస్తుంది. ఇదే సమయంలో మిగతా బ్రోకరేజ్ సంస్థల కంటే.. ఎక్కువగా 8.47 లక్షల క్లయింట్స్ జెరోధాకు ఉన్నారు. 2010లో ఇన్‌కార్పోరేట్ అయిన జెరోధా లాభాలు దాదాపు 100 శాతం పెరిగాయి. 2011-12 ఆర్ధిక సంవత్సరంలో 2.3 కోట్లుగా ఉన్న లాభం, 2017-18 కల్లా 224 కోట్లుగా పెరిగాయి. 
ఇక ఇతర బ్రోకింగ్ సంస్థలు తీసుకునే సేవా రుసుం కంటే జెరోథా చాలా తక్కువగా ఛార్జ్ చేయడమే కంపెనీ విజయానికి కారణంగా నిలిచింది. ఒక ట్రాన్సక్షన్‌కు కేవలం రూ. 20 తీసుకునే జెరోధాకు క్లయింట్లు పెరిగిపోయారు. డిస్కౌంట్ బ్రోకింగ్ రంగంలోకి ఇతర బ్రోకింగ్ కంపెనీలు కూడా మెల్ల మెల్లగా రావడం మొదలెట్టాయి. గత నెలలో యాక్సిస్ డైరెక్ట్, ఏంజిల్ బ్రోకింగ్ సంస్థలు డిస్కౌంట్ బ్రోకింగ్ ప్లాన్స్ ప్రకటించాయి. అయితే జెరోధా కంపెనీ సీఈఓ మాత్రం ఇప్పటికే ఉన్న బ్రోకింగ్ సంస్థల విషయంలో భయపడటం లేదు, కానీ విస్తారమైన నెట్ వర్క్ కలిగిఉన్న పేటీఎం విషయంలో మాత్రం పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉందని జెరోధా సీఈఓ నితిన్ కామత్ అంటున్నారు.