ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?! 

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 11,638 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. గురువారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభపడగా.. ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  దేశీయంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకావడంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా నేడు మరోసారి మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

స్వల్ప లాభాలతో సరి!
పలు రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం కన్సాలిడేషన్‌ బాటలో సాగాయి. స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి సెన్సెక్స్‌ 22 పాయింట్లు బలపడి 38,607కు చేరగా.. నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 11,597 వద్ద ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,562 పాయింట్ల వద్ద, తదుపరి 11,528 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,619 పాయింట్ల వద్ద, తదుపరి 11,641 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29667, 29547 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,879, 29,971 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐలు సైలెంట్‌
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం రూ. 476 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 16.6 కోట్ల విలువైన పెట్టుబడులను మాత్రమే నికరంగా వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1430 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 461 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



Most Popular