ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?! 

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,720 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో ఐఎంఎఫ్‌ తాజాగా కోత పెట్టడంతోపాటు యూరోపియన్‌ భాగస్వామ్య దేశాలతో వాణిజ్య వివాదాలు తలెత్తడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకానుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి నేడు మరోసారి మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

చివర్లో డబుల్‌ సెంచరీ
చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మంగళవారం సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. దీంతో రోజంతా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 239 పాయింట్లు జంప్‌చేసి 38,939 వద్ద నిలవగా.. నిఫ్టీ 67 పాయింట్లు ఎగసి 11,672 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,979-38,599 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ 11684-11570 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,600 పాయింట్ల వద్ద, తదుపరి 11,528 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,714 పాయింట్ల వద్ద, తదుపరి 11,756 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29823, 29533 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,285, 30,456 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌ఫీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 1212 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 689 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 330 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 624 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. Most Popular