ఇండియాబుల్స్‌- లక్ష్మీ విలాస్‌- చెక్‌? 

ఇండియాబుల్స్‌- లక్ష్మీ విలాస్‌- చెక్‌? 

ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకునేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ కౌంటర్లు విభిన్న తరహాగా ట్రేడవుతున్నాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకునే బాటలో రిజర్వ్‌ బ్యాంక్‌  కొన్ని రకాల అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చన్న అంచనాలు దీనికి కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 3.25 శాతం వెనకడుగుతో రూ. 832 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 821 వరకూ పతనమైంది. ఇక లక్ష్మీ విలాస్‌ బ్యాంకు 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా అమ్మేవాళ్లేతప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో రూ. 5 నష్టంతో రూ. 92.55 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ మాత్రం 12 శాతంపైగా దూసుకెళ్లి రూ. 108ను తాకింది. ఇతర వివరాలు చూద్దాం..

రియల్టీకి బైబై?
రిజర్వ్‌ బ్యాంక్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే రియల్టీ బిజినెస్‌ నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకోనున్నట్లు ఇండియాబుల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ గెహ్లాట్‌ పేర్కొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తన తొలి ప్రాధాన్యం ఫైనాన్షియల్‌ సర్వీసుల బిజినెస్‌కే అని గెహ్లాట్‌ చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ను వొదులుకోవలసిన అవసరం ఉండకపోవచ్చని గెహ్లాట్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకునే డీల్‌.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు గెహ్లాట్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకునేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఇప్పటికే ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. విలీనంలో భాగంగా లక్ష్మీ విలాస్‌ బ్యాంక్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 14 ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ షేర్లను కేటాయించనున్నారు.Most Popular