మోడీ కంటే మన్మోహన్ బెటర్ ! సెన్సెక్స్ రిటర్న్స్ అదే చెబ్తున్నాయ్

మోడీ కంటే మన్మోహన్ బెటర్ ! సెన్సెక్స్ రిటర్న్స్ అదే చెబ్తున్నాయ్

ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి, ఇప్పటివరకూ మన మార్కెట్లు ఏ స్థాయిలో పెరిగాయో తెలుసా? మే 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెన్సెక్స్ సగటున ఏడాదికి 9.37 శాతం కాంపౌండ్ వృద్ధి రేటు సాధించింది. మోడీ ప్రధాని అవుతారనే అంచనాలతో సెప్టెంబర్ 2013 నుంచి మే 2014 వరకు జరిగిన ర్యాలీతో పోల్చితే ఇది చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

 

2014 మే చివరి వారంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇప్పటివరకూ సెన్సెక్స్ 56 శాతం ర్యాలీ చేయగా.. నిఫ్టీ 58 శాతం పెరిగింది. ఈ ప్రకారం ఏడాదికి 9.52 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు నమోదయింది. 2005-2007 నుంచి పరిశీలిస్తే.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 12.68 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 10.85 శాతం చొప్పున పెరిగి బెస్ట్ రనప్‌ను చూపాయి. 


దేశీయ మదుపర్లు పెట్టుబడులు పెట్టడమే మార్కెట్లు పెరగడంలో కీలకంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, గోల్డ్ వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాల నుంచి మదుపరులు తమ పెట్టుబడులను ఈఖ్విటీలకు మరలించారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులకు ఆదరణ బాగా కనిపించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బీమా కంపెనీల వంటి దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 3.85 లక్షల కోట్లను మార్కెట్లలోకి తరలించగా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2.11లక్షల కోట్లను మన మార్కెట్లలో కుమ్మరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు చేయడంతో... కార్పొరేట్ ఎర్నింగ్స్ మందగించడం, ఆర్థిక రంగం మందగించడం, 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో జీఎస్‌టీ వంటి ప్రతికూలతలను మార్కెట్లు అధిగమించాయి.

వాల్యుయేషన్స్ భారీగా పెరిగిపోవడంతో.. గత ఐదేళ్లలో కార్పొరేట్ ఎర్నింగ్స్ అంతగా పెరుగుదల చూపించలేదని మోతీలాల్ ఓస్వాల్ వర్గాలు అంటున్నాయి.

 

నిఫ్టీలో సగటు ఎర్నింగ్స్ పర్ షేర్(ఈపీఎస్) రూ. 369గా ఉంది. 2014-17 కాలంలో ఇది 388కావడం గమించాలి. అయితే.. 2019నాటికి రూ. 409కి పెరిగింది. ఇది మరింతగా పెరగవచ్చని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నా... ఇది రుణదాతలు చేస్తున్న రికవరీ కారణంగా అంటున్నారు.

 

రిటర్న్‌ల లెక్కేంటి?
అటల్ బిహారీ వాజ్‌పేయ్ పాలన తర్వాత... మోడీ హయాంలోనే అతి తక్కువగా మార్కెట్లు రిటర్న్స్ ఇచ్చాయని గణాంకాలు చెబుతు్నాయి. గత రెండు దశాబ్దాలుగా మన ఈక్విటీల రికార్డులను పరిశీలిస్తే, 2001-09 కాలంలో యూపీఏ1కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సెన్సెక్స్ 180 శాతం పెరిగింది. అంటే ఏడాదికి 22.9 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు నమోదు అయింది.

 

యూపీఏ2 కాలంలో మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు 77.98 శాతం సెన్సెక్స్ పెరిగింది. ఇది 12.22 కాంపౌండెడ్ వృద్ధి రేటుకు సమానం. ఫిస్కల్ డెఫిసిట్, కరెంటు ఖాతా లోటు, రూపాయి మారకం వంటి పరిస్థితులను ఎదిరించి మరీ మార్కెట్లు పెరిగాయి. కానీ 2013 సెప్టెంబర్ ‌నుంచి 2014 మే మధ్య కాలంలో వచ్చిన ర్యాలీ మాత్రం మోడీ గెలుస్తారనే విశ్వాసం కారణంగా గుర్తుంచుకోవాలి.

 

సెప్టెంబర్ 1, 2013 నుంచి మే 30, 2014 మధ్య నిఫ్టీ 32 శాతం పెరిగింది. సెప్టెంబర్‌కు ముందు రఘురామ్ రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించినప్పటి నుంచి సూచీలు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి.

 

అంటే గణాంకాల ప్రకారం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కంటే, మన్మోహన్ హయాంలోనే మార్కెట్లు భారీగా వృద్ధి సాధించి, మదుపర్లకు ఎక్కువ లాభాలను అందించాయని అర్ధం.

 

కారణాలేంటి? వాస్తవమేనా?
2014 నుంచి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే, డాలర్ ప్రమాణాల ప్రకారం భారత ఇండెక్స్‌లు గణనీయంగా వృద్ధి సాధించాయి. గత ఐదేళ్లలో నిఫ్టీ డాలర్‌ ప్రమాణాల్లో 50 శాతం వృద్ధి, 8.5 శాతం కాంపౌండెడ్ వృద్ధిని నమోదు చేసింది. ఎంఎస్‌సీఐ వరల్డ్ ఇండెక్స్ 25 శాతం, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 8 శాతం, ఎంఎస్‌సీఐ చైనా ఇండెక్స్ 42 శాతం చొప్పున పెరిగాయి.

 

ఆర్థిక పరిస్థితులలో వాస్తవాలను పరిశీలించిన అనంతరం మాత్రమే, ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుందని కొందరు ఫండ్ మేనేజర్‌లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఆర్థిక రంగం మరమ్మత్తులకు గురవుతున్న దశలో ఉందని కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ అంటోంది. 
 



Most Popular