విదేశీ పెట్టుబడులు- మార్కెట్‌ ఖుషీ

విదేశీ పెట్టుబడులు- మార్కెట్‌ ఖుషీ

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లలో బుల్‌.. లాభాల రంకెలు వేస్తోంది. దీంతో ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డులను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 11,760ను దాటేసింది. ఈ బాటలో ఎన్‌ఎస్ఈ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ బ్యాంక్ నిఫ్టీ సైతం చరిత్రాత్మక గరిష్టాలను తాకింది. ఇందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత నెలలో ఉన్నట్టుండి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ యూటర్న్‌ తీసుకోవడంతో దేశీ స్టాక్స్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఎఫ్‌పీఐల జోరు
2019లో కనీసం మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందంటూ గతేడాది సంకేతాలిచ్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న గణాంకాల కారణంగా జనవరిలో వేచిచూసే ధోరణికి కట్టుబడనున్నట్లు ప్రకటించింది. తదుపరి మాటమారుస్తూ ఈ ఏడాది ఇకపై రేట్ల పెంపువైపు చూడబోమంటూ సంకేతాలిచ్చింది. దీంతో అధిక రిటర్నుల కోసం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌వైపు చూపు మరల్చినట్లు విశ్లేషకులు వివరించారు. ఫలితంగా ఒక్క మార్చి నెలలోనే ఎఫ్‌పీఐలు దేశీ కేపిటల్‌ మార్కెట్లలో రూ. 45,981 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. దీంతో మార్కెట్లు దాదాపు 8 శాతం లాభపడ్డాయి. ఈక్విటీ, రుణ సెక్యూరిటీలలో కలిపి రూ. 11,182 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఫిబ్రవరిలోనూ ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడిదారులుగా నిలవడం విశేషం! వెరసి ఈ రెండు నెలల్లోనూ ఎఫ్‌పీఐలు 7.31 బిలియన్‌ డాలర్లను పంప్‌చేశారు.

ఏప్రిల్‌లోనూ 
దేశీ కేపిటల్‌ మార్కెట్లలో ఏప్రిల్‌లోనూ ఇప్పటివరకూ(1-5 మధ్య) ఎఫ్‌పీఐలు రూ. 8634 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. నిజానికి ఈక్విటీలలో రూ. 8989 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ రుణ సెక్యూరిటీల నుంచి రూ. 355 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఈక్విటీలు, రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 44,500 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం!

ఇతర అంశాలూ 
దేశీయంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీకావడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదేసమయంలో పాక్‌ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వం సైనిక దాడులు చేపట్టడం ద్వారా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న అంచనాలు సైతం మార్కెట్లలో ర్యాలీకి దోహదపడుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.