ఈ వారం మార్కెట్లు బిజీ బిజీ

ఈ వారం మార్కెట్లు బిజీ బిజీ

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వీటిలో దేశీయంగా చూస్తే.. లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికల తొలి దశ 11న(గురువారం) ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణసహా ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాలలో పోలింగ్‌ జరగనుంది. కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఎలక్షన్‌ కమిషన్‌ తెరతీసింది. మే 19వరకూ దేశవ్యాప్తంగా ఏడు దశలలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌
ఈ నెల 12న(శుక్రవారం) సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ నాలుగో త్రైమాసిక(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో వచ్చే వారం నుంచీ గతేడాది(2018-19) క్యూ4 ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. ఇదే రోజు ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు(ఐఐపీ), మార్చి నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ఐఐపీ 1.7 శాతం వృద్ధికే పరిమితంకాగా.. ఫిబ్రవరిలో సీపీఐ స్వల్పంగా పెరిగి 2.57 శాతానికి చేరింది.కాగా.. విదేశీ అంశాల విషయానికివస్తే.. బుధవారం(10న) యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పరపతి సమీక్షను చేపట్టనుంది. ఇదే రోజు ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ అభిప్రాయాలను వెల్లడించే మినిట్స్‌ విడుదలకానున్నాయి. 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ మార్చి సమీక్షలో సంకేతాలిచ్చిన విషయం విదితమే.

బ్రెక్సిట్‌.. బ్రెక్సిట్‌
యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్‌) అంశంపై కొన్నేళ్లుగా అస్పష్టత కొనసాగుతుండటం గమనార్హం. ప్రధాని థెరెసా మే ప్రతిపాదించిన డీల్‌ను యూకే పార్లమెంట్‌ పలుమార్లు తోసిపుచ్చడంతో ఈ అంశంపై అనిశ్చిత కొనసాగుతూనే ఉంది. బ్రెక్సిట్‌కు ఈ నెల 12 డెడ్‌లైన్‌కాగా.. ఈయూ నాయకులు ఈ నెల 10న యూకే ప్రతిపక్షనేత జెరెమీ కార్బిన్‌తో అత్యయిక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇతర అంశాలూ
గత వారాంతాన ఆరు నెలల గరిష్టాన్ని తాకిన ముడిచమురు ధరలు, సాంకేతికంగా కీలకమైన 69 మార్క్‌ దిగువకు నీరసించిన రూపాయి మారకపు విలువ తదితర అంశాలు సైం మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, అమెరికా ఆర్థిక గణాంకాలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నదని తెలియజేశారు.Most Popular