ఆ స్టాక్ విలువ రూ.1 లక్ష ! కానీ రూ.6 కే ట్రేడ్ 

ఆ స్టాక్ విలువ రూ.1 లక్ష ! కానీ రూ.6 కే ట్రేడ్ 

ఓ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ రూ.6 మాత్రమే ఉంది. కానీ ఏడాదికోసారి రూ.15 డివిడెండ్‌ను క్రమం తప్పకుండా ఇస్తోంది. ఈ స్టాక్‌కు 15000 రెట్లు అధిక రేట్ ఇచ్చి కొనేందుకు ట్రేడర్లు ఎంతో మంది హాట్ క్యాష్‌తో రెడీగా ఉన్నారు. కానీ అమ్మేవాళ్లే లేరు. చిత్రంగా ఉన్నా ఇప్పుడీ వ్యవహారం అటు ఎక్స్ఛేంజీలకు ఇటు స్టాక్ హోల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. 

మనం ఇంతసేపూ చదివిది ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే మైక్రోక్యాప్ స్టాక్ గురించే. ఇది ఏషియన్ పెయింట్స్‌కు చెందిన ప్రమోటర్ల కంపెనీ. ప్రస్తుతం ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ దగ్గర ఏషియన్ పెయింట్స్‌కు చెందిన 2.83 కోట్ల షేర్లు (2.95 శాతం) ఉన్నాయి. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ షేర్ రూ.1500పైనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ లెక్కలతో పోలిస్తే ఎల్సిడ్ దగ్గర స్టాక్స్ విలువ రూ.4200 కోట్ల వరకూ ఉంటుంది. అయితే ఎల్సిడ్ పెయిడప్ క్యాపిటల్ మాత్రం 20 లక్షలు మాత్రమే ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 0.12 కోట్లు మాత్రమే. 

8 ఏళ్లలో 18 సార్లు ట్రేడింగ్ !
ఇంత గొప్ప వేల్యుయేషన్ ఉన్నా గత 8 నెలల నుంచి ఈ కౌంటర్‌లో ట్రేడింగే జరగట్లేదు. ఈ స్టాక్ గతేడాది ఆగస్ట్9వ తేదీన ట్రేడ్ అయింది. అప్పుడు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.5.89 దగ్గర క్లోజైంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2011నుంచి ఈ స్టాక్ కేవలం 18 సార్లు మాత్రమే ట్రేడ్ అయింది. కానీ ఎప్పటి నుంచో ఈ స్టాక్ ఏడాదికి రూ.15 చొప్పున డివిడెండ్‌ను మాత్రం చెల్లిస్తోంది. 

ఈ వాల్యుయేషన్‌ను గుర్తించిన ఎంతో మంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ స్టాక్‌ను కొనేందుకు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతీ రోజూ వేల కొద్దీ షేర్లకు బయ్ ఆర్డర్స్ ఉంటాయి కానీ అమ్మేవాళ్లే ఉండరు. ఈ రోజు కూడా సుమారు 18.25 లక్షల షేర్లకు బయింగ్ ఆర్డర్ పెండింగ్‌లో ఉంది. కానీ గతేడాది ఆగస్ట్‌లో జరిగిన 4,444  షేర్ల ట్రేడింగ్‌ మాత్రమే ఆఖరిది. 

ఎవరు అమ్ముకుంటారు ?
ఇంత వేల్యుయేషన్ ఉన్న స్టాక్‌ను ఇన్ఫార్డ్ ఇన్వెస్టర్స్ ఎవరూ పొరపాటున కూడా అమ్ముకోరు. జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి డైమండ్స్ దొరుకుతాయి. అందుకే వదులుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. నిపుణుల ప్రకారం ఈ స్టాక్ వేల్యూ రూ.80 వేల నుంచి 1 లక్ష వరకూ ఉంటుంది. కానీ అలాంటి స్టాక్ రూ.6కు మాత్రమే ఉంది. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ ప్రైస్ డిస్కవరీ జరగాలని కొంత మంది ఇన్వెస్టర్లు బాంబే హై కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సెబీ, బీఎస్ఈకి నోటీసులు జారీచేయాలని కోరారు. తక్షణం కాల్ ఆక్క్షన్ నిర్వహిస్తేనే ఈ స్టాక్‌కు సరైన ధర లభిస్తుందని కోరుతున్నారు. 

ఆఫర్ ఫర్ సేల్ ఫ్లాప్
ఎల్సిడ్ ప్రమోటర్లు 2013లో రూ.5000లకు ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో అదే ఏడాది డీలిస్టింగ్ ఆఫర్ కూడా (రూ.11.45)కు ప్రకటించారు. దీన్ని షేర్ హోల్డర్లు రిజెక్ట్ చేశారు. 
మైనార్టీ షేర్ హోల్డర్ల ఇంట్రెస్ట్‌ను కాపాడాల్సిన అవసరం ఉందని కొంత మంది నిపుణులు ఈ వ్యవహారంపై మాట్లాడుతున్నారు. ప్రమోటర్లు తక్కువ ధరకు షేర్లను జనాల నుంచి కొనేసి భారీగా సొమ్ము చేసుకునే ప్లాన్ వేశారనేది వాళ్ల మాట. ఈ స్టోరీ అంతా తెలియని ఇన్వెస్టర్లు ఎవరైనా తక్కువ ధరకు షేర్లను ఇచ్చేస్తే అది కంపెనీ మోసమే అవుతుందని చెబ్తున్నారు. 

ఎక్స్ఛేంజీలు ఏం చేయొచ్చు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్స్ఛేంజీలకు ఇలాంటి ప్రైస్ డిస్కవరీ మెకానిజంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వ్యవహారంపై ఎల్సిడ్, ఏషియన్ పెయింట్స్ స్పందిస్తే తప్ప సమస్యకు ఓ పరిష్కారం దొరకదు. ఈ లోపు షేర్ల ట్రేడింగ్ జరగట్లేదని ఎక్స్ఛేంజీలు డీలిస్ట్ చేయకుండా జాగ్రత్తపడాలి. చిన్న ఇన్వెస్టర్లను కాపాడాలి. 
ఇక్కడి నుంచి వెంటనే మీరు బీఎస్ఈకి వెళ్లి షేర్ ప్రైస్ చెక్ చేసి రేపటి నుంచి ఆర్డర్లు పెట్టేయాలని ఆత్రపడకండి. ఎందుకంటే లక్షలాది మంది ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లను కొనుగోలు చేయాలని ఆశగా ఉన్నారు. ఒక వేళ లక్ బాగుండి ఎవరైనా అమ్మాలని చూసినా 5 శాతం అప్పర్ సర్క్యూట్ ఉంది. అందుకని మరీ అంతగా ఆశపడి రూ.లక్ష స్టాక్‌ను రూ.6కు కొనేయాలని చూడొద్దు. Most Popular