బ్యాంకింగ్‌ కిక్‌- చివర్లో హైజంప్‌

బ్యాంకింగ్‌ కిక్‌- చివర్లో హైజంప్‌

అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకోవచ్చన్న భయాలకు ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే చెక్‌ పెట్టేశారు. ట్రేడింగ్ ప్రారంభంనుంచీ కొనుగోళ్లకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ ర్యాలీ బాట పట్టాయి. వెరసి ముందురోజు వాటిల్లిన నష్టాలను వెనువెంటనే పూడ్చుకోగలిగాయి. ప్రధానంగా మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు పట్టు విడవకపోవడంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ మరోసారి 38,000 పాయింట్ల ఎగువన నిలిచింది. 424 పాయింట్లు జంప్‌చేసి 38,233 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 129 పాయింట్లు పురోగమించి 11,483 వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తలెత్తనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా, సోమవారం ఆసియా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే.

ఐటీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ ఇండెక్సులు 3-2 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో మెటల్‌, ఫార్మా, రియల్టీ 1 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ మాత్రమే(0.4 శాతం) వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, వేదాంతా, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, ఐబీ హౌసింగ్‌ 4-2.4 శాతం మధ్య పెరిగాయి. అయితే టెక్‌ మహీంద్రా, ఐవోసీ, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, కోల్‌ ఇండియా 2.5-0.6 శాతం మధ్య నీరసించాయి. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ జోరు
పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో యూనియన్‌, కెనరా, సిండికేట్‌, ఇండియన్‌, బీవోఐ, బీవోబీ, పీఎన్‌బీ, ఓబీసీ, సెంట్రల్‌, ఐడీబీఐ, జేఅండ్‌కే బ్యాంక్‌ 5-1 శాతం మధ్య జంప్‌చేయడం విశేషం!

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు తిరిగి దూకుడు చూపడంతో మధ్య, చిన్నస్థాయి షేర్లలోనూ కొనుగోళ్లు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1410 లాభపడగా.. 1285 నష్టాలతో నిలిచాయి. 

డీఐఐలు సైలెంట్‌!
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 150 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైలెంట్‌ అయిపోయాయి. నామమాత్రంగా రూ. 12.5 కోట్ల విలువైన స్టాక్స్‌ నికరంగా విక్రయించాయి. కాగా.. గత వారం నాలుగు రోజుల్లోనే ఎఫ్‌పీఐలు  రూ. 7,100 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం విశేషం! అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్‌ రూ. 4520 కోట్ల  పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనించదగ్గ అంశం! Most Popular