ఈ ఎన్నికల్లో ఎవరి గెలుపు అవకాశాలు ఎన్ని?

ఈ ఎన్నికల్లో ఎవరి గెలుపు అవకాశాలు ఎన్ని?

దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి అందలం దక్కనుందో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సరిగ్గా 10 వారాల క్రితం కాంగ్రెస్ పార్టీకి మూడు హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో విజయం దక్కడంతో గాలి హస్తం వైపే ఉందని రాజకీయ పండితులు జోస్యం చెప్పారు. మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ ఈ ప్రధాన ప్రతిపక్షం అక్కడ జయకేతనాన్ని ఎగరేసింది. కానీ.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాను రాను బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి వైపే పలు సర్వేలు మొగ్గు చూపుతున్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో NDA కూటమి అధికారంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో UPA అధికారంలో ఉన్న మాట కాదనలేని వాస్తవం. కానీ... ఇక్కడ ఓటు బ్యాంకు ఎవరికి వారికి యథాతథంగా ఉన్నప్పటికీ.. లోక్ సభ ఎన్నికల సరళి విషయంలో ఇది తారుమారు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అలాగే కర్ణాటకలో అత్యధిక సీట్లు బీజేపీకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ జేడీని అడ్డుపెట్టుకుని అధికారం చలాయిస్తుంది. సంకీర్ణమే అయినప్పటికీ.. కాంగ్రెస్ కర్ణాటక మీద పట్టుకోల్పోలేదనే చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా ఓటింగ్ మద్దతు ఏ పార్టీకి మారలేదు. కానీ.. గత నాలుగేళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయాలను విస్మరించలేం. కుటుంబ బంధాలకు , రాగ ద్వేషాలకు అతీతంగా తాను పనిచేస్తున్నానని మోడీ పలు వేదికల మీద ఉటంకించడాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారనే విశ్లేషకులు భావిస్తున్నారు. నోట్ల రద్దు మినహా   మిగతా అన్ని అంశాల్లో మోడీకి సానుకూలతలే కనబడుతున్నాయి. రాఫెల్ ఒప్పందం విషయంలో అనామక కంపెనీకి లబ్ది చేకూర్చారన్న అభియోగాలు మోడీని కాస్త ఇరుకున పడేసేవే. కానీ.. ఆవిషయంలో కాంగ్రెస్ మరింత సమర్ధవంతంగా పనిచేయలేక పోతుందన్నది విశ్లేషకుల భావన. రాఫెల్ ఒప్పందంలో ఫ్రెంచ్ కంపెనీకి సహ కంపెనీగా అనిల్ అంబానీకి చెందిన రక్షణ సంస్థను జత చేయడంతో వివాదం మొదలైంది. అసలు రక్షణ రంగంలో కొంత కూడా అనుభవం లేని అనిల్ కంపెనీకి ఏ అర్హత ఉందంటూ.. కాంగ్రెస్ భగ్గుమంది. దేశ రక్షణకోసం అత్యంత శక్తివంతమైన రాఫెల్ విమానాలను కొనుగోలు చేస్తుంటే.. ఈ రాద్ధాంతమేంటంటూ.. బీజేపీ  కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టింది. అంతే కాకుండా గత నెలలో పుల్వామా దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీకి లబ్దిని చేకూర్చేవే. పాక్ విమానాలను కూల్చి వేయడం, పాక్ ప్రాంతంలోని ఉగ్రవాదుల శిబిరాల మీద దాడి వంటి అంశాల్లో ప్రధాని మోడీ మార్కులను కొట్టేశారు.

ఇక్కడ కూడా రాఫెల్ చర్చ జరిగింది. సైనికాధికారులు, ఇతర రక్షణ నిపుణులు పాక్ మన మీద దాడికి యత్నించినప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉండి ఉంటే.. పాక్ కు మరింత తీవ్ర నష్టాన్ని కలిగించి ఉండేవారమన్న వార్తలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి. రాఫెల్ ఒప్పందం నిజంగా జాతికి మేలు చేసేవిధంగా ఉండొచ్చన్న భావన జనాల్లోకి వెళ్లింది. ఇదే తరహాలో కాంగ్రెస్ హయాంలో జరిగిన బోఫోర్స్ ఒప్పందం మరకలు ఇప్పటికీ ఆ పార్టీని వదలడం లేదు. కానీ..అనూహ్యంగా రాఫెల్ ఒప్పందం మోడీ ఖ్యాతిని మరింత పెంచిందనే సర్వేలు చెబుతున్నాయి. 
ఇక పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వే పోల్స్ లో బీజేపీకి 188 సీట్లు, కాంగ్రెస్‌కు 84 సీట్లు వస్తాయని , అలయెన్స్ కూటమి లెక్కన చూస్తే.. NDA కూటమికి 250 సీట్లు, UPA కు 107 సీట్లు రావొచ్చని  వెల్లడైంది. 
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎంపీ ఎలక్షన్ల విషయంలో బీజేపీకే ఓట్లు పడొచ్చని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్‌ ఘడ్ వంటి చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవచ్చని వారు భావిస్తున్నారు. 


కాంగ్రెస్‌ ప్రధాన నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మినహా మరో ప్రజాకర్షక నేత కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. రాహుల్, ప్రియాంకా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇది కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేక ఫలితాలను తేవొచ్చు. యూపీఏలోని ఇతర పార్టీ నేతలు కురు వృద్ధులు కావడం, వారు ప్రచారం చేసే పరిస్థితిలో లేక పోవడం కూడా కాంగ్రెస్‌ను నష్టపరుస్తోంది. గత సంవత్సరం వరకూ దేశంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ బొక్కబోర్లా పడ్డ విషయం తెలిసిందే. కానీ.. లోక్ సభ ఎన్నికల విషయంలో ఆ ఓటింగ్ సరళి మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ కున్న ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని సర్వేలు చెప్పడంతో దేశీ మార్కెట్లు కూడా శరవేగంగా పుంజుకోడం మనం చూశాం. మోడీ ప్రభంజనాన్ని రాహుల్, లేదా ఆయన సోదరి ప్రియాంకా అడ్డుకోగలరా..? ఎర్రకోట మీద హస్తం జెండా ఎగుర వేస్తుందా? లేక మోడీ ప్రకటించిన రైతులకు రుణమాఫీ, పెట్టుబడి పథకాలు కమల నాథులను గట్టెక్కిస్తాయా.?  వేచి చూద్దాం.  

 Most Popular