మార్కెట్‌ ఓకే- ఐటీ నేలచూపు

మార్కెట్‌ ఓకే- ఐటీ నేలచూపు

ముందురోజు నష్టాల నుంచి కోలుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందిగిస్తున్న సంకేతాలపై ఆందోళనల నుంచి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బయటపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ తొలుత లాభాల సెంచరీ చేసింది. 37,963 వరకూ ఎగసింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 65 పాయింట్ల లాభంతో 37,874కు చేరగా.. నిఫ్టీ సైతం 22 పాయింట్లు బలపడి 11,376 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తలెత్తనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా, సోమవారం ఆసియా స్టాక్‌ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే.

రియల్టీ జోరు 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఐటీ ఇండెక్స్‌ మాత్రమే(1 శాతం) వెనకడుగులో ఉంది. ప్రధానంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ 2-0.8 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 7 శాతం జంప్‌చేయగా.. శోభా, బ్రిగేడ్‌, ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌ 3.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, వేదాంతా, ఐబీ హౌసింగ్, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ 2-1.4 శాతం మధ్య బలపడ్డాయి. అయితే టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టీసీఎస్‌, విప్రొ, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌ 2.2-0.5 శాతం మధ్య నీరసించాయి. 

జెట్‌ ఎయిర్‌  దూకుడు
డెరివేటివ్స్‌ విభాగంలో జెట్‌ ఎయిర్‌వేస్‌, జీఎంఆర్‌, రిలయన్స్ కేపిటల్‌, రెప్కో హోమ్‌, ఐడీఎఫ్‌సీ, అరవింద్‌, బాలకృష్ణ, యూనియన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 9-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, అశోక్‌ లేలాండ్‌, ఎంసీఎక్స్‌, పీవీఆర్, నిట్‌ టెక్‌ 2.6-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు లాభాలతో కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నస్థాయి షేర్లలోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-0.2 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1279 లాభపడగా.. 1127 నష్టాలతో కదులుతున్నాయి. Most Popular