బోయింగ్‌ అప్‌- యాపిల్‌ డౌన్‌

బోయింగ్‌ అప్‌- యాపిల్‌ డౌన్‌

ఆర్థిక మాంద్యంపై భయాలతో వారాంతాన డీలాపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. అయితే ఊగిసలాట మధ్య చివరికి అక్కడక్కడే అన్నట్టు(ఫ్లాట్‌)గా ముగిశాయి. డోజోన్స్‌ స్వల్పంగా 15 పాయింట్లు(0.06 శాతం) పుంజుకుని 25,517కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 2 పాయింట్ల(0.08 శాతం) నామమాత్ర నష్టంతో 2,798 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 5 పాయింట్లు(0.07 శాతం) నీరసించి 7,637 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. 2019లో కనీసం మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని ఇటీవలవరకూ చెబుతూ వచ్చిన ఫెడరల్ రిజర్వ్‌ ఉన్నట్టుండి వెనకడుగు వేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. అటు బ్యాలన్స్‌షీట్‌లో కోతను నిలిపివేయడంతోపాటు.. ఇటు అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. దీంతో శుక్రవారం ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. 

ఈల్డ్స్‌ భయాలు
పదేళ్ల కాలపరిమితి గల ట్రెజరీ ఈల్డ్స్‌ స్వల్పకాలిక బాండ్ల స్థాయికి నీరసించడంతో రానున్న రెండేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారినపడే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీంతో శుక్రవారం మార్కెట్లు పతనంకాగా.. సోమవారం నామమాత్రంగా కోలుకున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్‌ 2.40 శాతానికి క్షీణించాయి. ఇవి 2017నాటి కనిష్టాలుకాగా.. 737 మ్యాక్స్‌ విమానాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కార్యక్రమాలను ప్రారంభించడంతో బోయింగ్‌ కంపెనీ షేరు 2.3 శాతం పుంజుకుంది. దీంతో డోజోన్స్‌ నష్టాల నుంచి బయటపడింది. అయితే ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ 1.2 శాతం క్షీణించడంతో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ వెనకడుగు వేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లకు పోటీగా యాపిల్‌ సైతం టీవీ చానళ్ల స్ట్రీమింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే.

ఆసియా లాభాల్లో
ప్రపంచ వృద్ధిపై అందోళనలు, బ్రెక్సిట్‌పై అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో వారాంతాన బలహీనపడ్డ యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 0.2-0.4 శాతం మధ్య నీరసించాయి. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. జపాన్‌, ఇండొనేసియా, తైవాన్‌, సింపూర్‌, కొరియా, హాంకాంగ్‌ 2-0.25 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌ నామమాత్ర లాభంతోనూ.. చైనా నష్టంతోనూ ట్రేడవుతున్నాయి.Most Popular