నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?! 

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 11,371 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అమెరికాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ప్రపంచవ్యాప్తంగా సోమవారం అమ్మకాలకు దిగారు. దీంతో అమెరికా, ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. కాగా.. రెండు రోజుల్లో మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ప్రపంచ వృద్ధిపై డౌట్‌
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో సోమవారం అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు నష్టాలబారిన పడ్డాయి. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లు పతన బాటలో ప్రారంభమయ్యాయి. చివరివరకూ నష్టాలమధ్యే కొనసాగాయి. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా పతనమైంది. 37,667 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 356 పాయింట్లు కోల్పోయి 37,809 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103 పాయింట్లు తిరోగమించి 11,354 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,312 పాయింట్ల వద్ద, తదుపరి 11,270 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,396 పాయింట్ల వద్ద, తదుపరి 11438 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29182, 29082 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29355, 30,429 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు..

డీఐఐలు సైలెంట్
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 150 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైలెంట్‌ అయిపోయాయి. నామమాత్రంగా రూ. 12.5 కోట్ల విలువైన స్టాక్స్‌ నికరంగా విక్రయించాయి. కాగా.. గత వారం నాలుగు రోజుల్లోనే ఎఫ్‌పీఐలు  రూ. 7,100 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం విశేషం! అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్‌ రూ. 4520 కోట్ల  పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనించదగ్గ అంశం!Most Popular