ప్రపంచ వృద్ధిపై డౌట్‌- మార్కెట్లు డౌన్‌

ప్రపంచ వృద్ధిపై డౌట్‌- మార్కెట్లు డౌన్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో అమెరికాసహా ఆసియావరకూ మార్కెట్లు నష్టాలబారిన పడ్డాయి. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లు పతన బాటలో ప్రారంభమయ్యాయి. చివరివరకూ నష్టాలమధ్యే కొనసాగాయి. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా పతనమైంది. 37,667 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 356 పాయింట్లు కోల్పోయి 37,809 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103 పాయింట్లు తిరోగమించి 11,354 వద్ద స్థిరపడింది. 

విదేశీ మార్కెట్లు వీక్‌
ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. పలువురు విశ్లేషకుల అంచనాలను తల్లికిందులు చేస్తూ అక్టోబర్‌ నుంచీ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అమెరికా ఆర్థిక పురోగతి అంచనాలను సైతం కొంతమేర తగ్గించింది. దీంతో చైనాసహా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తాజాగా సందేహాలు తలెత్తాయి. ఫలితంగా వారాంతాన అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో దెబ్బతినగా.. ఆసియాలోనూ మార్కెట్లు నేలచూపులతో ముగిశాయి. 

అన్ని రంగాలూ డీలా
అమ్మకాలు ఊపందుకోవడంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3-1 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఇన్ఫ్రాటెల్‌, వేదాంతా,  జేఎస్‌డబ్లూ స్టీల్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌ 4.3-2 శాతం మధ్య నీరసించాయి. అయితే ఐవోసీ, ఓఎన్‌జీసీ 4.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాలతో ముగియడంతో మధ్య, చిన్నస్థాయి షేర్లలోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1887 నష్టపోగా.. 790 మాత్రమే లాభాలతో నిలిచాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, మహీంద్రా లైఫ్‌ 3.5-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.

ఎఫ్‌పీఐల దూకుడు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1374 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 675 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం హోలీ పండుగ సెలవుకాగా... అంతక్రితం మూడు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 5,727 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం విశేషం! ఇదే కాలంలో దేశీ ఫండ్స్‌ రూ. 3846 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనించదగ్గ అంశం! Most Popular