జేమ్స్‌ వారన్‌- కర్ణాటక బ్యాంక్‌ డౌన్‌

జేమ్స్‌ వారన్‌- కర్ణాటక బ్యాంక్‌ డౌన్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు వెల్లడించిన నేపథ్యంలో జేమ్స్‌ వారన్‌ టీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బైబ్యాక్‌ వివరాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్‌ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. మరోవైపు రుణ మోసానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌కు వివరాలు అందించిన నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం..

జేమ్స్‌ వారెన్‌ టీ
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌నకు శుక్రవారం సమావేశమైన బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు జేమ్స్ వారెన్‌ టీ పేర్కొంది. బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 115 ధర మించకుండా 23.25 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో దాదాపు 25 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 26.73 కోట్లను వెచ్చించనున్నట్లు వివరించింది. కాగా.. శుక్రవారం ముగింపు రూ. 129తో పోలిస్తే బైబ్యాక్‌ ధర 11 శాతం తక్కువకావడంతో ఇన్వెస్టర్లు నిరాశపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రమోటర్లు సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్‌ఈలో జేమ్స్‌ వారన్‌ టీ షేరు 5 శాతం పతనమైంది. రూ. 123 దిగువన ట్రేడవుతోంది. 

Image result for karnataka bank

కర్ణాటక బ్యాంక్‌
ఎస్‌ఆర్‌ఎస్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు ఫండ్‌ ఆధారిత వర్కింగ్‌ కేపిటల్‌ను సమకూర్చడంలో రూ. 13.26 కోట్లమేర ఫ్రాడ్‌ జరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కు కర్ణాటక బ్యాంక్‌ తెలియజేసింది. మల్టిపుల్‌ బ్యాంకింగ్‌ ఒప్పందాలలో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌ ఫైనాన్స్‌కు వర్కింగ్‌ కేపిటల్‌ ఫెసిలిటీని సమకూర్చినట్లు కర్ణాటక బ్యాంక్‌ వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్‌ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 125 వద్ద ట్రేడవుతోంది. Most Popular