అమ్మకాల సెగ- మార్కెట్లకు ఫీవర్‌

అమ్మకాల సెగ- మార్కెట్లకు ఫీవర్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో అమెరికాసహా ఆసియావరకూ మార్కెట్లు నష్టాలబారిన పడ్డాయి. దేశీయంగానూ అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 421 పాయింట్లు పతనమై 37,744కు చేరగా.. నిఫ్టీ సైతం 123 పాయింట్లు కోల్పోయి 11,333 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు ఊపందుకోవడంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 2-1 శాతం మధ్య క్షీణించాయి. 

బ్లూచిప్స్‌ డీలా
నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, జీ, ఇన్ఫ్రాటెల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్లూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 3-2 శాతం మధ్య నీరసించాయి. అయితే ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ 2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో జైన్‌ ఇరిగేషన్‌, జేపీ, ఇన్ఫీబీమ్‌, ఈక్విటాస్‌, ఇండియా సిమెంట్స్‌, సుజ్లాన్‌, డిష్‌ టీవీ, ఐఆర్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌ 4.5-3.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఆర్‌ఈసీ 9 శాతం, పీఎఫ్‌సీ 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జెట్‌ ఎయిర్‌, బీహెచ్ఈఎల్‌, దివీస్‌ లేబ్‌, రిలయన్స్ కేపిటల్‌, ఆయిల్‌ ఇండియా 3.5-1.7 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మధ్య, చిన్నస్థాయి షేర్లలోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1733 నష్టపోగా.. 637 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఎడిల్‌వీజ్‌, ఐఐఎఫ్‌ఎల్‌, యూబీఎల్‌, దివాన్‌ హౌసింగ్‌, క్రాంప్టన్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, నాట్కో, సెంట్రల్‌ బ్యాంక్‌, కాల్గేట్‌, అదానీ ట్రాన్స్‌ 4.5-2.5 శాతం మధ్య క్షీణించగా.. స్మాల్‌ క్యాప్స్‌లో శివ టెక్స్‌, జెన్‌టెక్‌, హెచ్‌వోవీ, గాబ్రియెల్‌, ముకంద్‌, బాంబే డయింగ్‌, జియోజిత్‌, ప్రభాత్‌, సారేగామా, గల్ఫ్‌ ఫెట్రో, రేడియో సిటీ, సికాల్‌ తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి.

విదేశీ మార్కెట్లు వీక్‌
ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. పలువురు విశ్లేషకుల అంచనాలను తల్లికిందులు చేస్తూ అక్టోబర్‌ నుంచీ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అమెరికా ఆర్థిక పురోగతి అంచనాలను సైతం కొంతమేర తగ్గించింది. దీంతో చైనాసహా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తాజాగా సందేహాలు తలెత్తాయి. ఫలితంగా వారాంతాన అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో దెబ్బతినగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. Most Popular