మళ్లీ మాంద్యం కోరల్లో అమెరికా?!

మళ్లీ మాంద్యం కోరల్లో అమెరికా?!

దశాబ్దం క్రితం అమెరికాలో మొదలై ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టబెట్టిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభం మరవకముందే.. ఇదే బాటలో మరోసారి మాంద్యం ముప్పు ముంచుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నట్లు తాజాగా పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శృతిమించిన గృహ రుణాల కారణంగా 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావంతో ఇప్పటికీ అమెరికాసహా పలు దేశాలు వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో అమలు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు జోష్‌నిచ్చేందుకు బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి చౌకగా నిధులను పంప్‌చేస్తున్నాయి. ఫలితంగా గతేడాది తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరందుకున్న సంకేతాలు అటు అమెరికా.. ఇటు యూరోపియన్‌ దేశాలలోనూ వెలువడ్డాయి. వెరసి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ 2018లో నాలుగుసార్లు వడ్డీ రేట్లను పెంచివేయగా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సైతం ఈ బాటలో నడిచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే ఏడాది తిరిగేలోగా పరిస్థితులు తలకిందులైనట్లు కనిపిస్తోంది. ఇందుకు ఆర్థికవేత్తలు పలుకారణాలను ప్రస్తావిస్తున్నారు. అవేంటో చూద్దాం...

Related image
 
వాణిజ్య వివాదాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య గత కొద్ది నెలలుగా వాణిజ్య వివాదాలు కొనసాగుతున్నాయి. చైనాతో వాణిజ్యం వల్ల లోటు భారీగా పెరుగుతున్న కారణంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ దిగుమతులపై టారిఫ్‌ల విధింపునకు తెరతీశారు. ఈ బాటలో యూరోపియన్‌ కార్ల దిగుమతులపైనా అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనా సైతం అమెరికన్‌ ప్రొడక్టుల దిగుమతులకు చెక్‌పెట్టే చర్యలకు దిగింది. మరోపక్క యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్‌) ప్రక్రియపై నెలల తరబడి అస్పష్టత కొనసాగుతుండటం.. ఈయూ దేశాలకు తలనొప్పిగా పరిణమించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో చెలరేగిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు చౌక నిధులను వ్యవస్థలోకి పంప్‌చేసినప్పటికీ ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో గాడిన పడిన దాఖలాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా ఆర్థిక వృద్ధి వేగం తగ్గడం.. అమెరికాలో ఉపాధి, తయారీ, రిటైల్‌ అమ్మకాలు తదితర గణాంకాలు బలహీనపడటం వంటి అంశాలు ఫెడరల్‌ రిజర్వ్‌నూ పునరాలోచనలో పడేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి ఫెడరల్ రిజర్వ్‌ తాజా పాలసీ సమీక్షలో 2019లో వడ్డీ రేట్ల పెంపు జోలికిపోమంటూ సంకేతాలిచ్చిందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా బాండ్ల విక్రయాన్ని సైతం నిలిపివేసేందుకు నిర్ణయించడంతో ఇన్వెస్టర్లలో అమెరికా ఆర్థిక పురోగతిపై సందేహాలు తలెత్తినట్లు చెబుతున్నారు. మరోపక్క జర్మనీ తయారీ రంగం వరుసగా మూడో నెలలోనూ నీరసించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

ట్రెజరీ సంకేతాలు
వారాంతాన 10ఏళ్ల కాలపరిమితిగల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ 2018 స్థాయికి నీరసించాయి. అంతేకాకుండా మూడు నెలల రేట్లస్థాయికి క్షీణించాయి. దీర్ఘకాలిక రేట్లు స్వల్పకాలిక రేట్లకంటే దిగువకు చేరడం మాంద్యానికి సంకేతాలని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం స్టాక్‌ ఇండెక్సులు 2019లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.కాగా.. రిస్కులు పెరిగినప్పుడల్లా బంగారం జోరందుకునే సంగతి తెలిసిందే. ఇటీవల పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. మరోపక్క రక్షణాత్మక కరెన్సీగా భావించే జపనీస్‌ యెన్‌ ఆరు వారాల గరిష్టాన్ని తాకింది. ఈ అంశాలు రానున్న ఏడాదిన్నర కాలంలోగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారినపడే సంకేతాలు ఇస్తున్నట్లు విశ్లేషకులు వివరించారు.Most Popular