నేలచూపుతో రూపాయి షురూ!

నేలచూపుతో రూపాయి షురూ!

డాలరుతో మారకంలో వారాంతాన డీలాపడిన దేశీ కరెన్సీ మరోసారి బలహీనంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 11 పైసలు నీరసించి 69.06 వద్ద మొదలైంది. తదుపరి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో మరికొంత క్షీణించింది. ప్రస్తుతం 16 పైసలు(0.24 శాతం) బలహీనపడి 69.11 వద్ద ట్రేడవుతోంది. కాగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలపడిన రూపాయి చివరికి బలహీనపడింది. మార్కెట్ల బాటలో మిడ్‌సెషన్‌ నుంచీ వెనకడుగు వేసింది. చివరికి అటు సెన్సెక్స్‌ 222 పాయింట్లు నష్టపోగా.. ఇటు రూపాయి 12 పైసలు క్షీణించి 68.95 వద్ద ముగిసింది. 

ప్రపంచ వృద్ధిపై సందేహాలు
ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ మాట మార్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. పలువురు విశ్లేషకుల అంచనాలను తల్లికిందులు చేస్తూ అక్టోబర్‌ నుంచీ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అమెరికా ఆర్థిక పురోగతి అంచనాలను సైతం కొంతమేర తగ్గించింది. దీంతో చైనాసహా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తాజాగా సందేహాలు తలెత్తాయి. ఫలితంగా వారాంతాన అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో దెబ్బతినగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఈ బాటలో దేశీయంగానూ స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ 2018 తదుపరి కనిష్టాలకు చేరాయి. 2019లో కనీసం మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందంటూ  గత డిసెంబర్‌వరకూ సంకేతాలిస్తూ వచ్చిన ఫెడ్‌ ఒక్కసారిగా వెనకడుగు వేయడంతో గ్లోబల్‌ గ్రోత్‌పై సందేహాలు తలెత్తినట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. Most Popular