స్టెర్లింగ్‌ బయోటెక్‌ కుంభకోణం : 21 దేశాలకు ఎల్‌ఆర్‌లను పంపనున్న ఈడీ

స్టెర్లింగ్‌ బయోటెక్‌ కుంభకోణం : 21 దేశాలకు ఎల్‌ఆర్‌లను పంపనున్న ఈడీ

బ్యాంక్‌ కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు సీరియస్‌ అయింది. వెంటనే స్టెర్టింగ్‌ బయోటెక్‌ మోసం కేసులో నిందుతులను పట్టుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. దీనికోసం విదేశీ సాయం పొందేందుకు ఈడీకి ఢిల్లీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకి గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ రూ.8,100 కోట్లు బకాయిపడి మోసం చేసిందన్న ఆరోపణలు రావడంతో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఇంగ్లాండ్‌, యూఏఈ సహా 21 దేశాలకు లెటర్స్ రోగేటరీ లేదా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్‌ఆర్)లను పంపేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. 

ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ డైరెక్టర్లను స్వదేశానికి రప్పించడంలో భాగంగా యూఎస్‌, చైనా, పనామా, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎల్‌ఆర్‌లను పంపడానికి ఈడీకి అదనపు సెషన్స్ కోర్టు జడ్డీ సతీశ్ కుమార్ అరోరా అనుమతినిచ్చారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమెరికా, చైనా, పనామా, ఆస్ట్రియా, సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఇండోనేషియా, బార్బడోస్, బెర్ముడా, బ్రిటీష్ వర్జిన్ ఐస్‌లాండ్స్, సైప్రస్, కొమోరాస్, జెర్సీ, లీచెన్‌స్టీన్, మారిషస్, నైజీరియా, సీషెల్స్ దేశాలకు ఎల్‌ఆర్‌లను పంపనున్నది. ఈ మేరకు ఈడీ తరఫు న్యాయవాది ఏఆర్ ఆదిత్యా.. కోర్టును కోరగా అనుమతి లభించింది.

ఇక ఈడీ అభ్యర్థనతో ఇంటర్‌పోల్ జారీ చేసిన నోటీసుల ఆధారంగా స్టెర్లింగ్‌ బయోటెక్‌ డైరెక్టర్లలో ఒకరైన హితేష్ నరేందర్ భాయ్ పటేల్‌ను 4 రోజుల క్రితం అల్బేనియా రాజధాని టిరానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్టెర్లింగ్‌ బయోటెక్‌ డైరెక్టర్లు నితిన్ సందేసరా, చేతన్‌కుమార్ సందేసరా అల్బేనియా పౌరసత్వం పొందారంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రానా తెలియజేయడంతో వారి అప్పగింత విజ్ఞప్తిని పంపేందుకు ఈడీని ఇటీవలే కోర్టు అనుమతించింది. దీంతో ఈ ముగ్గురు డైరెక్టర్లతో పాటు ఇతర దేశాల్లో ఉన్న మిగతా వారి కోసం మొత్తం 21 దేశాలకు(సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, హాంగ్‌కాంగ్‌, ఇండోనేషియా, బార్బడోస్‌, బెర్ముడా, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐస్‌లాండ్స్‌, క్రిప్‌రస్‌, కొమోరాస్‌, జెర్సీ, మారిషస్‌, నైజీరియా, సీషెల్స్‌, సైప్రస్‌ తదితర దేశాలు) ఎల్‌ఆర్‌లను పంపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెడీ అవుతోంది. ఇప్పటికే మొత్తం ఐదు చార్జిషీట్లను దాఖలు చేసిన ఈడీ.. ఇప్పటిదాకా రూ.4,710 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. మరోవైపు ఐటీ శాఖలోని సీనియర్ అధికారులకు స్టెర్లింగ్ బయోటెక్ యజమానుల లంచం ఆరోపణలపైనా కోర్టులో విచారణ జరుగుతోంది. Most Popular