బంగారంలో పెట్టుబడి పెట్టాల్సిన టైం ???

బంగారంలో పెట్టుబడి పెట్టాల్సిన టైం ???

బంగారం రేట్లు ఈ ఏడాది మరింతగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అనేక అంశాలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది. ముఖ్యంగా బంగారం వినియోగం 150 టన్నులకు పైగా పెరిగింది. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం సీరియల్‌ను తలపిస్తోంది. నెలలునెలలుగా సాగుతున్న ఈ ట్రేడ్ వార్‌ ఓ కొలిక్కి వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. వీటికి తోడు అమెరికాలో మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయని అనేక గణాంకాలు సూచిస్తున్నాయి. వడ్డీరేట్లు పెంచేందుకు ఆ దేశ ఫెడరల్ రిజర్వ్‌కు ధైర్యం సరిపోవడం లేదు. ఇక బ్రెగ్జిట్ కూడా ఇప్పట్లో అయ్యేలా లేదు. ఇది కూడా రెండేళ్ల నుంచి నానుతూనే ఉంది. వీటి నేపధ్యంలో అమెరికన్ డాలర్‌కు పెద్దగా డిమాండ్ ఎక్డా లేదు. డాలర్ ఇండెక్స్ కూడా బలహీనంగానే ఉంది. 

వాస్తవానికి బంగారంతో వీటన్నింటికీ ప్రత్యక్షంగా - పరోక్షంగా ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే డాలర్ డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ నీరసిస్తుంది. ఇప్పుడు డాలర్ డిమాండ్ పడిపోవడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై అపనమ్మకం బంగారానికి ఊపు తెస్తోంది. తాజాగా వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2017లో 4,159.9 టన్నులుగా ఉన్న బంగారం వినియోగం 2018లో 4345.10 టన్నులకు పెరిగింది. వీటిని విశ్లేషించి చూస్తే మెల్లిగా పుత్తడికి గిరాకీ పెరుగుతూ వస్తోంది. 

రేట్ ఎలా ఉండబోతోంది
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1310 డాలర్ల వరకూ పలుకుతోంది. ఇది మెల్లిగా 1420 డాలర్ల వరకూ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వివిధ అసెట్ క్లాసులు నీరసించినప్పుడు గోల్డ్‌కే డిమాండ్ అధికంగా ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతానికి ఎంసీఎక్స్‌లో పది గ్రా. ప్యూర్ గోల్డ్ రూ.32150 వరకూ ఉంది. ఇది రూ.33500-34000 మధ్యకు చేరొచ్చని బులియన్స్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. 

అందుకే ఇప్పుడున్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌లో భాగంగా గోల్డ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే రూ.100 పెట్టుబడిలో గోల్డ్‌కు 5-10 శాతం వరకూ పోర్ట్‌ఫోలియోలో స్థానం కల్పించవచ్చు. 


 Most Popular