వృద్ధిపై ఆందోళన- యూఎస్‌ బోర్లా

వృద్ధిపై ఆందోళన- యూఎస్‌ బోర్లా

ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో శుక్రవారం ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. పలువురు విశ్లేషకుల అంచనాలను తల్లికిందులు చేస్తూ అక్టోబర్‌ నుంచీ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అమెరికా ఆర్థిక పురోగతి అంచనాలను సైతం కొంతమేర తగ్గించింది. వెరసి వారాంతాన స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్‌ 460 పాయింట్లు(1.8 శాతం) క్షీణించి 25,502కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 54 పాయింట్లు(1.9 శాతం) నష్టంతో 2,801 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 196 పాయింట్లు(2.5 శాతం) పతనమై 7,643 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. 2019లో కనీసం మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని ఇటీవలవరకూ చెబుతూ వచ్చిన ఫెడరల్ రిజర్వ్‌ ఉన్నట్టుండి వెనకడుగు వేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. అటు బ్యాలన్స్‌షీట్‌లో కోతను నిలిపివేయడంతోపాటు.. ఇటు అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. 

యూరోప్‌ డౌన్‌
ఇటీవల అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తున్న అంచనాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించగా.. తాజాగా అమెరికా జీడీపీ నీరసిస్తున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ అంచనా వేసింది. మరోవైపు బ్రెక్సిట్‌ తదితర సమస్యలతో యూరోపియన్‌ యూనియన్‌ సైతం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగిస్తూ వస్తోంది. ఈ అంశాలు మార్కెట్లను దెబ్బతీసినట్లు విశ్లేషకులు వివరించారు. ప్రపంచ వృద్ధిపై అందోళనలు, బ్రెక్సిట్‌పై అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో శుక్రవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 1.6-2 శాతం మధ్య పతనమయ్యాయి.

Image result for Netflix

నైక్‌ పతనం 
ఉత్తర అమెరికాలో అమ్మకాలు అంచనాలను చేరకపోవడంతో స్పోర్ట్స్‌వేర్‌ దిగ్గజం నైక్‌ ఇంక్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ఈ షేరు 6.6 శాతం పతనమైంది. సోమవారం నుంచీ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులు ప్రారంభించనుండటంతో నెట్‌ఫ్లిక్స్‌ ఇంక్‌ 4.5 శాతం పతనమైంది. ఇదే విధంగా మోడల్‌ 3 కార్లకు డిమాండ్‌ మందగిస్తున్నట్లు కోవెన్‌ పేర్కొనడంతో ఆటో రంగ దిగ్గజం టెస్లా ఇంక్‌ 3.5 శాతం క్షీణించింది. 737 మ్యాక్స్‌ విమానాలపై సందేహాలతో 6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఇండొనేసియన్‌ ఎయిర్‌లైన్‌ 'గరుడ' తాజాగా ప్రకటించింది. దీంతో బోయింగ్‌ కంపెనీ షేరు 3 శాతం తిరోగమించింది. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనా వేయడంతో లగ్జరీ రిటైలింగ్‌ సంస్థ టిఫనీ ఇంక్ 3 శాతం ఎగసింది.Most Popular