రుపీ- వారాంతాన వీక్‌

రుపీ- వారాంతాన వీక్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలపడిన రూపాయి చివరికి బలహీనపడింది. మార్కెట్ల బాటలో మిడ్‌సెషన్‌ నుంచీ వెనకడుగు వేసింది. చివరికి అటు సెన్సెక్స్‌ 222 పాయింట్లు నష్టపోగా.. ఇటు రూపాయి 12 పైసలు క్షీణించి 68.95 వద్ద ముగిసింది. హోలీ పండుగ సందర్భంగా గురువారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. తొలుత డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ జోరందుకుంది. ఇంట్రాడేలో 29 పైసలు ఎగసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 68.54 వరకూ పుంజుకుంది. తదుపరి నీరసిస్తూ వచ్చి 69.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. బుధవారం రూపాయి 13 పైసలు బలపడి 68.83 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అంతక్రితం ఆరు రోజుల రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో మంగళవారం రూపాయి 43 పైసలు నీరసించి 68.96 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధానంగా ముడిచమురు ధరలు జోరందుకోవడం, డాలరు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మంగగళవారం(19న) వరకూ వరుసగా ఆరో రోజు బలపడటం ద్వారా రూపాయి 7 నెలల గరిష్టాన్ని అందుకుంది. ఆరు రోజుల్లో ఏకంగా 160 పైసలు పురోగమించడం విశేషం! Most Popular