ఈ వారం మార్కెట్ల ఊగిసలాట!?

ఈ వారం మార్కెట్ల ఊగిసలాట!?

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం(25-29) ఊగిసలాట మధ్య కదిలే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(28న) మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటమే దీనికి కారణంకాగా.. ట్రేడర్లు తమ పొజిషన్లను ఏప్రిల్‌ సిరీస్‌కు రోలోవర్‌ చేసుకుంటారని తెలియజేశారు. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే వీలున్నట్లు వివరించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల మౌలికసదుపాయాల గణాంకాలను 29న విడుదల చేయనుంది. 

Image result for us china trade talks

విదేశీ అంశాలూ కీలకమే
అంతర్జాతీయ అంశాలూ దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయగలవని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాద పరిష్కార చర్చలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు యూఎస్‌ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లితిజెర్‌, ఆర్థిక కార్యదర్శి స్టీవెన్‌ ముచిన్‌ ఈ నెల 28-29 మధ్య చైనాను సందర్శించనున్నారు. తదుపరి ఏప్రిల్‌ తొలి వారంలో చైనా వైస్‌ప్రెసిడెంట్‌ యూఎస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) గత పాలసీ వివరాలు మినిట్స్‌ ద్వారా 25న వెల్లడికానున్నాయి. 

బ్రెక్సిట్‌.. బ్రెక్సిట్!
గత కొద్ది నెలలుగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్) అంశంపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కొన్ని షరతులతో బ్రెక్సిట్‌ గడువును యూరోపియన్‌ యూనియన్‌ మే 22 వరకూ పొడిగించేందుకు అంగీకరించింది. యూకే ప్రధాని థెరెసా మే ప్రతిపాదిస్తున్న విత్‌డ్రాయల్‌ డీల్‌పై ఈ వారం ఓటింగ్‌ జరగనుంది. ఈ డీల్‌ను యూకే పార్లమెంట్‌ సమర్థించవలసిందిగా ఈయూ షరుతు విధించినట్లు తెలుస్తోంది.

వీటికీ  ప్రాధాన్యం
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్‌(డీఐఐలు) పెట్టుబడులు వంటి అంశాలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.Most Popular