అమ్మకాల షాక్‌- బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌

అమ్మకాల షాక్‌- బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించడంతో లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. చివరివరకూ అమ్మకాలదే పైచేయికావడంతో నేలచూపులతో ముగిశాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్లు క్షీణించి 38,165 వద్ద నిలిచింది. ఫలితంగా 8 రోజుల లాభాలకు చెక్‌ పడింది. నిఫ్టీ సైతం 64 పాయింట్ల నష్టంతో 11,457 వద్ద ముగిసింది. కొద్ది రోజులుగా మార్కెట్లు ర్యాలీ బాటలో సాగడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ సెంచరీ చేసింది. 38,500ను అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ అయితే తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించి రికార్డ్‌ సృష్టించింది. పలువురి అంచనాలను తల్లికిందులు చేస్తూ ఫెడరల్ రిజర్వ్‌ 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. రియల్టీ 0.65 శాతం బలపడింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం, ఆటో 1.3 శాతం చొప్పున క్షీణించాయి. ప్రభుత్వ బ్యాంక్స్‌లో బీవోబీ, సిండికేట్‌, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, కెనరా, ఓబీసీ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, ఆర్‌ఐఎల్‌, జీ, మారుతీ, గెయిల్‌ 3.2-1.7 శాతం మధ్య నీరసించాయి. అయితే ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, యాక్సిస్‌, హిందాల్కో 3.8-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. కాగా.. రియల్టీ స్టాక్స్‌లో  ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 6-3.5 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో శోభా, సన్‌టెక్‌ 0.6 శాతం స్థాయిలో లాభపడ్డాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌
ఉన్నట్టుండి మార్కెట్లు వెనకడుగు వేసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలు పెరిగాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1703 నష్టపోగా.. 1013 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల దూకుడు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1772 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1323 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. గత రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 3955 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2523 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. Most Popular