ఆరియన్‌ప్రొ అప్‌- ఆర్‌ఈసీ డౌన్‌ 

ఆరియన్‌ప్రొ అప్‌- ఆర్‌ఈసీ డౌన్‌ 

సొంత అనుబంధ సంస్థ ఇంటెగ్రో టెక్నాలజీస్‌ ద్వారా సింగపూర్‌ నుంచి కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించడంతో ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోపక్క గ్రామీణ విద్యుత్‌ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసినట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) వెల్లడించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం...

ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్
బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ విభాగంలో సింగపూర్‌ నుంచి ప్రస్తావించదగ్గ స్థాయిలో కాంట్రాక్టును పొందినట్లు ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ తాజాగా వెల్లడించింది. మలేసియా, చైనా తదితర దక్షిణాసియా దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం నుంచి ఆర్డర్ లభించినట్లు పేర్కొంది. ఆర్డర్‌ విలువ రూ. 20 కోట్లుకాగా.. లోన్‌ ఒరిజినేషన్‌ సిస్టమ్‌ ప్రొడక్ట్స్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆరియన్‌ప్రొ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 148 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 26.69% వాటా ఉంది. 

Image result for pfc and rec

ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ
ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో ప్రభుత్వానికున్న 52.63 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తాజాగా పీఎఫ్‌సీ పేర్కొంది. ఇందుకు షేరుకి రూ. 139.50 చొప్పున చెల్లించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువ రూ. 14,500 కోట్లుకాగా.. దీనిలో భాగంగా 103.94 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఈసీ షేరు 3 శాతం క్షీణించి రూ. 141 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో పీఎఫ్‌సీ షేరు సైతం 1 శాతం నీరసించి రూ. 113 వద్ద కదులుతోంది. 2018 డిసెంబర్‌లో ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Most Popular