జీవీకే పవర్‌- టాటా పవర్‌ జోరు

జీవీకే పవర్‌- టాటా పవర్‌ జోరు

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాటాను పెంచుకున్నట్లు వెల్లడించడంతో మౌలికసదుపాయాల హైదరాబాద్‌ సంస్థ జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క దేశ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వైమానిక నిఘాకు సంబంధించిన రాడార్ల సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు తెలియజేయడంతో టాటా పవర్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

జీవీకే పవర్‌
అనుబంధ సంస్థ జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ ద్వారా ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(MIAL)లో 10 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా తాజాగా పేర్కొంది. వాటాదారుల ఒప్పందంలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఒక్కో షేరుకి రూ. 77 చొప్పున ధర చెల్లించినట్లు తెలియజేసింది. కంపెనీ ఇంతక్రితం బిడ్‌వెస్ట్‌ నుంచి మరో 13.5 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో MIALలో జీవీకే పవర్‌ వాటా 50.5 శాతం నుంచి 74 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీవీకే పవర్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 7.4 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 7.65 వరకూ ఎగసింది.

Image result for tata power

టాటా పవర్‌
ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా దేశ రక్షణ శాఖ నుంచి 23 రాడార్ల సరఫరాకు కాంట్రాక్టును పొందినట్లు టాటా పవర్‌ తాజాగా పేర్కొంది. టాటా పవర్‌ స్ట్రాటజిక్‌ ఇంజినీరింగ్ డివిజన్‌(SED) ద్వారా లభించిన ఈ ఆర్డర్‌ విలువ రూ. 1200 కోట్లుకాగా.. షిప్‌ బార్న్ 3డి ఎయిర్‌ సర్వీలియన్స్ రాడార్లను భారత నావికాదళానికి అందించాల్సి ఉంటుందని వివరించింది. కాంట్రాక్టును పదేళ్ల కాలంలో పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా పవర్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 73.50 వద్ద ట్రేడవుతోంది. Most Popular