ఈ రియల్టీ షేర్లకు దూకుడెక్కువ!

ఈ రియల్టీ షేర్లకు దూకుడెక్కువ!

గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడూ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. అయితే ఇటీవల రియల్టీ రంగం మాత్రం ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.పెట్టుబడులకు వీలు కల్పించడం ద్వారా దేశీయంగా రియల్‌ ఎస్టేట్‌ రంగ అభివృద్ధికి తెరతీసే యోచనతో 2014లో మార్కెట్ల నియంత్రణ సెబీ.. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(REITs-రీట్స్‌)కు అనుమతించింది. తదుపరి ఈ విభాగంలో గత వారమే తొలిసారి ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకిరావడం, విజయవంతంగా నిధులను సమీకరించడం సెంటిమెంటుకు బూస్ట్‌నిచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు సంస్థ ఎంబసీ ప్రాపర్టీ చేపట్టిన తొలి REITs పబ్లిక్‌ ఇష్యూకి దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ. 4750 కోట్ల సమీకరణ కోసం పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో భాగస్వామ్యంలో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ ఇష్యూకి దాదాపు 2.6 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలైన విషయం విదితమే. ఐపీవోకు ముందురోజు కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1743 కోట్లను సమీకరించింది కూడా. ఇష్యూకి మొత్తం రూ. 5,300 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలుకావడం గమనార్హం.

బెంగళూరు సంస్థలు
గత 10 రోజుల నుంచీ చూస్తే రియల్టీ కౌంటర్లలో ర్యాలీ కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను అత్యధికంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 27 శాతం లాభపడగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 22 శాతం ఎగసింది. ఈ బాటలో బ్రిగేడ్‌, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, శోభా 12-5 మధ్య లాభపడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని తగ్గించడం, కమర్షియల్‌ రియల్టీకి డిమాండ్‌ పెరుగుతుండటం వంటి అంశాలు ఈ రంగానికి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బ్రోకింగ్‌ సంస్థలు రేటింగ్‌లను అప్‌గ్రేడ్‌ చేయడం, రెసిడెన్షియల్‌ విభాగంతో పోలిస్తే వాణిజ్య సముదాయాలకు డిమాండ్‌ పెరుగుతుండటం, అద్దెలు పుంజుకోవడం వంటి అంశాలు కూడా వీటికి జత కలిసినట్లు తెలియజేశారు. ఈ బాటలో డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌ రియల్టీ వంటి సంస్థలు రెండు విభాగాలపైనా దృష్టిపెట్టినప్పటికీ ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఫీనిక్స్‌ మిల్స్‌ అద్దె ఆదాయాన్ని అధికంగా ఆర్జిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వాణిజ్య విభాగంలో బెంగళూరు మార్కెట్‌ నుంచి వార్షికంగా 10-11 మిలియన్‌ చదరపు అడుగులమేర కార్యాలయాలు ఆక్రమించుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బెంగళూరు కమర్షియల్‌ రియల్టీలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అత్యధికంగా ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

షేర్ల జోరు
ప్రస్తుతం మార్కెట్లు లాభాల నుంచి నష్టాల బాటపట్టినప్పటికీ రియల్టీ రంగం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ 1.5 శాతం బలపడింది. ఈ రంగంలోని కౌంటర్లలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 8 శాతం దూసుకెళ్లి రూ. 273ను తాకగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 4.5 శాతం జంప్‌చేసి రూ. 847కు చేరింది. ఇతర కౌంటర్లలో ఒబెరాయ్‌ రియల్టీ 4 శాతం ఎగసి రూ. 515 వద్ద, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 3 శాతం పెరిగి రూ. 253 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో శోభా, సన్‌టెక్‌ సైతం 1 శాతం చొప్పున బలపడ్డాయి.Most Popular