ఫెడరల్‌ మొగల్‌- జూబిలెంట్‌ లైఫ్‌ వీక్‌

ఫెడరల్‌ మొగల్‌- జూబిలెంట్‌ లైఫ్‌ వీక్‌

యూఎస్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేందుకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 'ధర'ను నిర్ణయించిన నేపథ్యంలో ఆటో విడిభాగాల సంస్థ ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క మైసూరులోని నంజాన్‌గడ్‌ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారిక చర్యలు తీసుకోనున్నట్లు(OAI) తెలియజేయడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం...

ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌
కంపెనీ టేకోవర్‌లో భాగంగా యూఎస్‌ సంస్థ టెన్నెకో ఇంక్‌ షేరుకి రూ. 608.46 ధరలో ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది గత ముగింపుతో పోలిస్తే 6 శాతం అధికంకాగా.. సెబీ ఈ ధరను నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. తద్వారా ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌లో 25 శాతం వాటా కొనుగోలుకి టెన్నెకో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం పతనమై రూ. 558 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 587-553 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

Image result for jubilant life sciences

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
మైసూరులోని జనరిక్స్‌ ఏపీఐ తయారీ ప్లాంటులో 2018 డిసెంబర్‌ 10-18 మధ్య తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా అధికారిక చర్యల సంకేతాలు ఇచ్చినట్లు జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ పేర్కొంది. ఫలితంగా ఈ ప్లాంటుకు సంబంధించి పెండింగ్‌ అప్లికేషన్లు, సప్లిమెంట్లకు అనుమతులు నిలిచిపోయే అవకాశమున్నట్లు వివరించింది. దీంతో ఈ కౌంటర్‌ డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.4 శాతం నష్టంతో రూ. 764 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 752 దిగువకు పతనమైంది. అయితే OAI కారణంగా కంపెనీ పనితీరు ప్రభావితంకాబోదని జూబిలెంట్‌ తెలియజేసింది. 40 రోజుల్లోగా ఇందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.Most Popular