నష్టాలలో- రియల్టీ ప్లస్‌

నష్టాలలో- రియల్టీ ప్లస్‌

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించడంతో లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం 83 పాయింట్లు క్షీణించి 38,304 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 32 పాయింట్లు బలహీనపడి 11,489ను తాకింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ సెంచరీ చేసింది. 38,500ను అధిగమించింది. అందరి అంచనాలను తల్లికిందులు చేస్తూ ఫెడరల్ రిజర్వ్‌ 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం టెక్‌ దిగ్గజాల అండతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. రియల్టీ 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఐషర్, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌ 3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హెచ్‌పీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, జీ, ఆర్‌ఐఎల్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్ ఫార్మా 2.4-0.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ప్రెస్టేజ్‌, శోభా, సన్‌టెక్‌ 1-0.6 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో జస్ట్‌డయల్‌, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌సీసీ, క్యాస్ట్రాల్‌, జెట్‌ ఎయిర్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, టాటా పవర్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జేపీ, రిలయన్స్ కేపిటల్‌, ఆర్‌ఈసీ, చెన్నై పెట్రో, ఐసీఐసీఐ ప్రు, రిలయన్స్‌ ఇన్ఫ్రా, ఐడియా 3.2-2 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌

మార్కెట్లు కన్సాలిడేట్‌ అవుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1305 నష్టపోగా.. 967 లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular