ఫెడ్‌ జోష్‌- మళ్లీ పరుగందుకున్న రుపీ

ఫెడ్‌ జోష్‌- మళ్లీ పరుగందుకున్న రుపీ

హోలీ పండుగ సందర్భంగా గురువారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. దేశీ కరెన్సీ తిరిగి జోరందుకుంది. డాలరుతో మారకంలో 19 పైసలు బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 68.64 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం మరింత పుంజుకుని 68.54 వద్ద ట్రేడవుతోంది. ఇది 29 పైసలు అధికంకాగా.. బుధవారం 13 పైసలు బలపడి 68.83 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం తొలుత బలహీనంగా ప్రారంభమైంది. డాలరుతో మారకంలో 69.11 వరకూ నీరసించింది. తిరిగి మిడ్‌సెషన్‌ నుంచీ ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో చివర్లో జోరందుకుంది. 68.72 వరకూ రూపాయి ఇంట్రాడేలో బలపడింది. కాగా.. అంతక్రితం ఆరు రోజుల రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో మంగళవారం రూపాయి 43 పైసలు నీరసించి 68.96 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధానంగా ముడిచమురు ధరలు జోరందుకోవడం, డాలరు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం(19న) వరకూ వరుసగా ఆరో రోజు బలపడటం ద్వారా రూపాయి 7 నెలల గరిష్టాన్ని అందుకుంది. ఆరు రోజుల్లో ఏకంగా 160 పైసలు పురోగమించడం విశేషం! 

ఫెడ్‌ దన్ను
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా యథాతథ పాలసీ అమలును ప్రకటించడంతోపాటు.. 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలిచ్చింది. నిజానికి ఏడాదికాలంగా ఫెడ్‌ 2019లో కనీసం మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చంటూ సంకేతాలిస్తూ వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వడ్డీ రేట్ల పెంపును వ్యతిరేకిస్తున్నప్పటికీ 2018లో ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(FOMC) నాలుగుసార్లు వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25-2.5 శాతంగా అమలవుతున్నాయి. ఫెడ్‌ ఉన్నట్టుండి సరళతర విధానాలవైపు మొగ్గడంతో ట్రెజరీ ఈల్డ్స్‌ క్షీణించాయి. ఇప్పటివరకూ దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు  ఇకపై మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రూపాయికి మరింత బలం చేకూరే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.Most Popular