స్పైస్‌జెట్‌కు జెట్‌ ఎయిర్‌ జోష్‌

స్పైస్‌జెట్‌కు జెట్‌ ఎయిర్‌ జోష్‌

రుణాలు, నష్టాల భారంతో సమస్యల్లో ఇరుక్కున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఓవైపు విమాన సర్వీసులను రద్దు చేస్తుంటే.. మరోపక్క చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ లబ్ది పొందుతోంది. సిబ్బందికి వేతనాల చెల్లింపులనూ వాయిదా వేస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు కూడా. ఇప్పటికే సుమారు 70 విమానాలను సర్వీసుల నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేయగా.. స్పైస్‌జెట్‌, ఇండిగో సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.

స్పైస్‌జెట్‌ చేతికి..
జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేసిన విమానాలతోపాటు.. రద్దు చేసిన రూట్లలో సర్వీసులను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం స్పైస్‌జెట్‌కు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేరు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. బుధవారం 20 శాతం దూసుకెళ్లిన స్పైస్‌జెట్‌ షేరు మరోసారి జోరందుకుది. ప్రస్తుతం బీఎస్ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 105 వరకూ ఎగసింది. ఇక మరోపక్క ఎన్‌ఎస్ఈలో ఇండిగో విమాన సర్వీసులను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ దాదాపు 1 శాతం బలపడి రూ. 1433 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో ఈ షేరు రూ. 1453 వరకూ పెరిగింది.  కాగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సైతం దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 223 వద్ద ట్రేడవుతోంది.Most Popular