ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు- తదుపరి?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు- తదుపరి?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 12 పాయింట్లు బలహీనపడి 11,580 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండు రోజుల పాలసీ సమీక్షా నిర్ణయాలను ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(FOMC) ప్రకటించింది. ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25-2.5 శాతంగా ఉన్నాయి. దీంతో ఇదే స్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి. కాగా.. ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ఇకపైన కూడా రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా ఫెడ్‌ కమిటీ దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు.. రుపీకి జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీయంగా మార్కెట్లు బలపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అటూఇటుగా..
హోలీ పండుగ సందర్భంగా గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం వరుసగా రెండో రోజు కన్సాలిడేషన్‌ బాటలో సాగాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ట్రేడయ్యాయి. అయితే మంగళవారం చివర్లో తిరిగి జోరందుకున్నప్పటికీ బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు అటూఇటూగా ముగిశాయి. సెన్సెక్స్‌ 23 పాయింట్ల స్వల్ప లాభంతో 38,387 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా 8వ రోజూ లాభపడినట్లయ్యింది. అయితే నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 11,521 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,503 పాయింట్ల వద్ద, తదుపరి 11,485 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,568 పాయింట్ల వద్ద, తదుపరి 11,602 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల దూకుడు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1772 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1323 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. గత రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 3955 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2523 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. Most Popular