ఆర్‌ఐఎల్‌- టాప్‌ చెయిర్‌లో!

ఆర్‌ఐఎల్‌- టాప్‌ చెయిర్‌లో!

దేశీ స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన ప్రయివేట్‌ రంగ దిగ్గజాలలో ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువరీత్యా మరో మైలురాయిని చేరుకుంది. లిస్టెడ్‌ కంపెనీలలో 127 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్)ను సాధించింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 69గా పరిగణిస్తే.. ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 8.74 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి టాప్‌చెయిర్‌ను కైవసం చేసుకుంది. టాటా గ్రూప్‌ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) రూ. 7.6 లక్షల కోట్లతో మార్కెట్‌ విలువ రీత్యా ద్వితీయ ర్యాంకులో నిలవగా.. రూ. 6.2 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్‌తో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడో ర్యాంకును సాధించింది. 

రిటైల్‌, టెలికం దన్ను
పెట్రోకెమికల్స్‌ రంగంలో ప్రధాన కంపెనీగా ప్రారంభమైన ఆర్‌ఐఎల్‌ తదుపరి రిటైల్‌, టెలికం రంగాలలోనూ భారీ ఎత్తున ప్రణాళికలు అమలు చేసింది. జియో బ్రాండు ద్వారా టెలికం రంగ స్వరూపాన్నే మార్చివేస్తూ వేగంగా బిజినెస్‌ను విస్తరిస్తోంది. ఫలితంగా ఈ ఏడాది(2018-19) మూడో త్రైమాసికంలో ఆర్‌ఐఎల్‌ రూ. 10,251 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ3(అక్టొబర్‌-డిసెంబర్)లో రూ. 22,628 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించింది. దీనిలో కన్జూమర్‌ విభాగం నుంచే 25 శాతం సమకూరడం గమనార్హం! రిలయన్స్‌ జియో రూ. 12,252 కోట్ల ఆదాయం సముపార్జించగా.. నికర లాభం రూ. 831 కోట్లను తాకింది. 

షేరు జోరు
ఈ కేలండర్‌ ఏడాది(2019) తొలి మూడు నెలల్లో ఆర్‌ఐఎల్‌ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు పెట్రోకెమికల్స్‌, రిటైల్‌, టెలికం రంగాలు చూపుతున్న జోరు దోహదం చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల కంపెనీ నష్టాలకు లోనవుతున్న ఈస్ట్‌ వెస్ట్‌ పైప్‌లైనును రూ. 13,000 కోట్లకు విక్రయించేందుకు నిర్ణయించింది. బ్రూక్‌ఫీల్డ్‌ ఇందుకు ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో షేరు మరింత ఊపందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. 2018లోనూ ఆర్‌ఐఎల్‌ షేరు 22 శాతం ర్యాలీ చేయడం ప్రస్తావించదగ్గ అంశం! Most Popular