అరవింద్‌ హైజంప్‌- జూబిలెంట్‌ పతనం

అరవింద్‌ హైజంప్‌- జూబిలెంట్‌ పతనం

అరవింద్‌ లిమిటెడ్‌ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి ఇటీవలే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన అరవింద్‌ ఫ్యాషన్స్ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఎనిమిదో రోజు ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఇక మరోపక్క బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

అరవింద్‌ ఫ్యాషన్స్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 916.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం కాగా.. ఈ నెల 8న లిస్టయిన ఈ షేరు ఇప్పటివరకూ 48 శాతం ర్యాలీ చేసింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరిగింది. గత కొద్ది రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 40 రెట్లు అధికంగా షేర్లు చేతులు మారడం గమనించదగ్గ అంశం! అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో టెక్స్‌టైల్‌ బ్రాండ్లు, రిటైల్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా లాల్‌భాయ్‌ గ్రూప్‌ సంస్థ అరవింద్‌ లిమిటెడ్‌ విడదీసింది. దీనిలో భాగంగా అరవింద్‌ లిమిటెడ్‌ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 5 షేర్లకుగాను 1 అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరుని కేటాయించిన విషయం విదితమే. 

Related image

జూబిలెంట్ లైఫ్‌ సైన్సెస్‌
ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌డీల్‌ ద్వారా 33 లక్షల షేర్లు ట్రేడైనట్లు వెల్లడికావడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ షేరు 6 శాతం పతనమైంది. రూ. 792 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 783 దిగువకు జారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జూబిలెంట్‌ లైఫ్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం 15 రెట్లు ఎగసింది. జూబిలెంట్‌ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ 35 లక్షల షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 370 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.Most Popular