అడాగ్‌ షేర్లు జూమ్‌

అడాగ్‌ షేర్లు జూమ్‌

దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ తమ్ముడు అనిల్‌ అంబానీని ఆర్థికంగా ఆదుకోవడంతో అడాగ్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. స్వీడిష్‌ సంస్థ ఎరిక్‌సన్‌ కేసుకు సంబంధించి అనిల్‌ అంబానీ చెల్లించాల్సిన రూ. 453 కోట్లను ముకేశ్‌ సర్దుబాటు చేసినట్లు వెల్లడికావడంతో అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రిలయన్స్‌ కేపిటల్‌ 4 శాతం పెరిగి రూ. 187కు చేరగా.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 3.5 శాతం లాభపడి రూ. 140 వద్ద,  రిలయన్స్‌ పవర్ 4 శాతం ఎగసి రూ. 11.45 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఆర్‌కామ్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 4.40ను తాకగా, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 4 శాతం బలపడి రూ. 30 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ 1.5 శాతం పుంజుకుని రూ. 196 వద్ద, రిలయన్స్‌  నావల్‌ 5 శాతం ఎగసి రూ. 10 వద్ద ట్రేడవుతున్నాయి.

ఆదుకున్న అన్న
ఎరిక్‌సన్‌ కేసులో మూడు వారాల్లోగా రూ. 453 కోట్లను చెల్లించమంటూ అనిల్‌ అంబానీని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. లేదంటే మూడు నెలలపాటు జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇందుకు గడువు ఈ నెల 19(నేటి)తో ముగియనుంది. అయితే ముకేశ్‌ అంబానీ సహాయంతో అనిల్‌ అంబానీ ఒక రోజు ముందుగానే రూ. 453 కోట్లను చెల్లించడం గమనార్హం! ఈ సందర్భంగా అన్న ముకేశ్‌, వదిన నీతా అంబానీలకు అనిల్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. ఇప్పటికే ఎరిక్‌సన్‌కు అనిల్‌ అంబానీ రూ. 118 కోట్లను చెల్లించిన విషయం విదితమే.Most Popular